28, జనవరి 2011, శుక్రవారం

మా ఊరి గాంధీబొమ్మకి ప్రొమోషన్ వచ్చిందోచ్

నిన్నకాక మొన్నే డిసెంబర్ 19న nrt85 సిల్వర్ జూబ్లి మీట్ జరుపుకున్నాం. అదేరోజు మేం చదువుకున్న మున్సిపల్ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీసు సెంటర్లో గాంధీ బొమ్మకు వినతిపత్రం కూడా సమర్పించాము.  హైస్కూల్లో సమస్యలైతే చాలా కొద్దిగానే పరిష్కారమైనయి గానీ, మా వినతిపత్రం తీసుకున్న గాంధీగారి విగ్రహానికి మాత్రం కాంస్య విగ్రహంగా ప్రొమోషన్ వచ్చింది. జనవరి 28 అంటే నిన్న పాతగాంధీవిగ్రహం స్ధానంలోనే కొత్తగా మిలమిల మెరిసే కాంస్యవిగ్రహాన్ని మాజీముఖ్యమంత్రి,స్ధానికమంత్రివర్యుల ఆధ్వర్యంలో కోలాహలంగా ఆవిష్కరించారు. ఈ మెరుపులు, ప్రసంగాలు, పేపర్ క్లిప్పింగ్స్ , ప్రచారకార్యక్రమం చూస్తుంటే నిజంగానే నరసరావుపేటంతా మెరిసిపోతున్నదేమోననిపిస్తుంది. కానీ అంతకు ముందు రోజే  మా మిత్రులు నరసరావుపేట మరియు చుట్టుప్రక్కల రోడ్ల పరిస్ధితిపై  గుంటూరుజిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీలో ప్రజా ప్రయోజన వాజ్యం వేసినారు. జడ్జి ముందు హాజరైన ఆర్ & బి అధికారులు రోడ్లన్నీ బాగానే ఉన్నయంటూ కితాబిచ్చారు. కానీ రోడ్ల వాస్తవ పరిస్ధితిపై మనమిత్రలు గట్టిగా పట్టు పట్టడంతో జడ్జి ఆదేశం మేరకు జనవరి 27వతేదినాడు ఆర్ & బి అధికారులతో జాయింట్ ఇనస్పెక్షన్ చేయడంతో రోడ్ల నిజస్ధితి బయటపడింది . క్రింద ఫోటోలు చూడండి. నరసరావుపేట-పిడుగురాళ్ల రోడ్డు, నకరికల్లు-గుండ్లపల్లి రోడ్డు,నకరికల్లు-సంతమాగలూరు అడ్డరోడ్డు,సంతమాగలూరు-నరసరావుపేటరోడ్డు,నరసరావుపేట-కేసానుపల్లి రోడ్డు తనిఖీలో ఎలా ఉన్నాయంటే, ఈ రోడ్డుల్లో ఏ మాత్రం పరధ్యానంగా ప్రయాణం చేసినా సీదా పరలోకానికే ప్రయాణం- టిక్కెట్ లేకుండా.  ఇందుమాలంగా  ఈ పరిస్ధితిని నరసరావుపేట మేలుకోరే నెట్ జెన్ లందరికీ తెలియజేయడమైనది.మనఊరికెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోగలరని మనవి.
డా.శివబాబు
                                              
27-01-2011 నాడు తనిఖీలో నరసరావుపేట చుట్టుప్రక్కల రోడ్ల పరిస్ధితి ఈ క్రింది ఫోటోల్లో చూడండి
ఈ " నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక " సభ్యుడు నరసింహారావును కూడా తనిఖీ చేస్తున్న ఫోటోల్లో చూడచ్చు








కామెంట్‌లు లేవు: