26, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రియమైన మిత్రులారా

మన నరసరావుపేట బ్లాగు లొ ఇప్పటివరకు కేవలం కొద్దిమంది మాత్రమే పొస్ట్ చేస్తున్నారు.  మీరు మీకు అందుబాటు లొ ఉన్న మునిసిపల్ హైస్కూలు పూర్వ విద్యార్ధులు అందరికి ఈ బ్లాగ్ గురించి తెలియచేసి ఎక్కువమంది పాల్గొనేటట్లు చూడగలరు.-ఆనంద్ కుమార్

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురం!

మా జ్ఞాపకాల  గురించి చెప్పే ముందు నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవాలి. నేను చేసిన ఎంక్వైరి ప్రకారం పాత భవనంలో ఆఫీసు ప్రక్కన ఉండే కెమిస్ట్రీ ల్యాబ్ పైన ఒక రాతిమీద 1901 వ సంవత్సరం అని ఉన్నదని  సీనియర్ మాస్టారు (లంకా మాస్టారు) చెప్పారు. రామకోటి మాస్టారు లాంటి సీనియర్స్ తో మాట్లాడి  ఇతర మున్సిపల్ రికార్డ్స్ పరిశీలించాలని చెప్పారు. ఏమైనా 1901లో ఎలిమెంటరీ స్కూల్ కానీ , డైరెక్టుగా హైస్కూల్ గా కానీ ప్రారంభమైందని చెప్పవచ్చు.  ఇకపోతే ఈ క్రింది ఫోటోలో ఒక విశేషముంది . చూడండి. 
ఈ ఫోటో గుర్తుపట్టారా?
చారిత్రాత్మక మున్సిపల్ హైస్కూల్ ఎంట్రన్స్ లో ఎదురుగా ఉండేది గాంధిగారి విగ్రహం. ఈ విగ్రహం శిలాఫలకంపై 19 ఫిబ్రవరి, 1948 అని ఉంది . చూశారా! అంటే ఈ విగ్రహం కరెక్ట్ గా  గాంధీజీ హత్యానంతరం 19రోజులకు ఆవిష్కరించబడిందన్నమాట. అంత చరిత్రుంది మా హైస్కూల్లో గాంధీ విగ్రహానికి. కొత్త భవనం నిర్మాణం అయిపోయిన వెంటనే ఈ విగ్రహం మరలా క్షేమంగా ప్రతిష్టించడానికి చూస్తున్నారులెండి! ఇప్పుడు ప్రస్తుతం ఈ విగ్రహం హెడ్ మిసెస్ రూమ్ లోనే భద్రపరచబడింది.

అప్పటి బిల్డింగ్ లో హెడ్ మాస్టర్ రూమ్ ప్రక్కన కుడి భాగం


                                             అప్పటి బిల్డింగ్ మరో కోణం నుండి

అప్పటినుండి ఇప్పటికి ఎంతోమంది అసంఖ్యాకమైన విద్యావంతుల్ని తయారుచేసింది ఇదే మున్సిపల్ హైస్కూల్. అందులోభాగంగానే మా జ్ఞాపకాల్ని కొన్నింటిని ఇక్కడ పంచుకుంటాను. 1980-81 నుండి జరిగిన విశేషాలండీ ఇవి.  నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్ అన్నప్పటికీ,  ప్రధానంగా మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ గురించే అనుకోండి నేను వ్రాస్తున్నది. నరసరావుపేటలో  శ్రీరాంపురంలో తిలక్ కాన్వెంట్ నుండి నేరుగా 6వ తరగతికి మున్సిపల్ హైస్కూల్ లో చేరాను. అంతా కొత్త కొత్తగా , భయం భయంగా ఉండేది. దానికి తగ్గట్టే ఉండేవారు  ఛండశాసనుల్లాంటి మా  మాస్టర్లు కూడా. మచ్చుకు కొంతమంది మాస్టర్ల గురించి చెప్తాను. చదివే ముందు ఒకటి గమనించండి సుమా! ఆనాటి మా మాస్టార్ల గురించి , మా చదువుల గురించి సంతోషంతో,సగర్వంతో మీదుమిక్కిలి కొంత సరదాగానే వ్రాస్తున్నాను తప్పించి , వ్యంగ్యంగా-విమర్శతో కాదని చదువరులకు నా మనవి.మాకు అప్పుడు నరసింహారావు మాస్టారు తెలుగు చెప్పేవారు. ఆయన రోజూ హోమ్ వర్క్ దిద్దేవారు.  ఇచ్చిన హోమ్ వర్క్ చెయ్యనివాళ్లని పిలిచి, ముందర ఆయన  చేతికున్న వాచి తీసి టేబుల్ పై పెట్టి, స్టూడెంట్ ను  చేతులు చాపమని  బెత్తంతో వాతలు తేలేలా కొట్టేవారు. ఒకరోజు క్లాసులో మా ముందుబెంచిలో ఒకడు హోమ్ వర్క్ వ్రాయకుండా వచ్చాడు. వాడిపేరు పిలిచిన వెంటనే, వాడు వణుక్కుంటూ క్లాసులో ముందరకు మాస్టారు దగ్గరకు వెళ్ళేసరికి వాడికి ఒకటీ, రెండూ కలిపి 
ఒకేసారి వచ్చాయి. వేసుకున్న లాగుపై ముడ్డిదగ్గర చేయి గట్టిగా పెట్టుకుని వణుకుతూ నిల్చునేసరికిమాస్టారికి పరిస్థితి అర్ధమై, వాసనొస్తుంది, క్లాసులో చేయకురా,బయటకు పో ! అని అరిచారు. వాడు ఒకటే పరుగు బయటకు. క్లాసు వదిలాక చూస్తే దారిపొడుగుతా "నిప్పులు" గుర్తులు.  చూసుకుంటూ తొక్కకుండా  నడవాల్సివచ్చింది.
 బుగ్గమీద మచ్చతో చేతిలో బెత్తంతో నిల్చునే నర్సింహరావు మాస్టారినీ, ఈ సంఘటననీ జీవితంలో మర్చిపోలేమండీ! తర్వాత చెప్పుకుంటున్నది రాధాకృష్ణమూర్తి మాస్టారిగురించి. ఆయన కూడా తెలుగుకే వచ్చేవారు. పంచెకట్టుకొచ్చేది ఆయనొక్కడే మరి. అందుకే ఆయన్ను " గోచి పీకుడు " మాస్టారు అని పిల్చేవాళ్లమి.  తెలుగు చాలా తన్మయత్వంతో  చెప్పేవారు. అలాగే సైన్సుకు వచ్చే వెంకట్రామయ్యగార్ని ఎప్పుడూ నోట్లో వక్కపొడి లేకుండా చూడలేము. ఆయన దూరంగా కనబడగానే "వక్కపొడి మాస్టారు" అనే వాళ్లం. సైన్సు చాలా సరదాగా చెప్పేవారు. ఇక గోపరాజు మాస్టారి గురించి చెప్పాలి. ఆయన మాధ్స్ చెప్పేవారు. పిల్లల్ని  కొట్టాలంటే ముందుగా నుదుటిదగ్గర జుట్టు రెండువేళ్లతో అందినంత పుచ్చుకుని, ఆ జుట్టుతోనే స్టూడెంట్ ని పైకిలేపి కొట్టేవారు. అలాగే కొన్ని విషయాలు సులభంగా  గుర్తుండేందుకు అంటూ గమ్మత్తైన మాటలు సంధానించి చెప్పేవారు.
 వృత్తలేఖిని అనేందుకు ఉత్తలేకిది  అనీ, డి-కోణాన్ని గుర్తుంచుకునేందుకు సగంబొక్కరా దీనికుండేది అనేవారు. అందుకే మా వాళ్లకి చాలామందికి ఇప్పటికీ ఆ పరికరాలు గుర్తుండిపోయాయనుకోండి ! మొన్న డిసెంబర్ లో సిల్వర్ జూబ్లి మీట్ కి  కూడా ఆయన చలాకీగా హాజరై, తన ఆరోగ్య రహస్యాలు చెప్పారు.   డ్రిల్ చేయించే ఆశీర్వాదం మాస్టారు కూడా గుర్తే, ఎందుకంటే పిల్లలతో చాలా సరదాగా ఉండేవారు. ఇక పార్ధసారధిగారు హెడ్ మాస్టర్ గా ఎంత భయపెట్టారో అందరికీ తెల్సిందే. ఆయన బెత్తం పట్టుకుని ధర్డ్ బెల్లు అయినాక నిల్చున్నారంటే,
  ఎవరికైనా లోపలికి పోవాలంటే హడల్ ! ఇక్కడో జోక్ చెప్తానండీ. సుబ్బారావు మాస్టారు మాకు హిందీ చెప్పేవారు. అయనకు మేము పెట్టుకున్న ముద్దుపేరు "హడావిడి సుబ్బారావు". ఆయన తన ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు.  మా స్నేహితుడు జాజం.శ్రీను (ఇప్పుడు nrtలో బిజినెస్ చేస్తున్నాడు) మాస్టారిని తమాషా పట్టించాడు. ఎలాగంటే ఒకసారి జాజం.శ్రీను బజారులో సుబ్బారావు మాస్టారికి కనబడి, నమస్తే మాస్టారూ అన్నాడు. ఏరా  ట్యూషన్ కి రాకూడదా అన్నారు మాస్టారు. మనవాడు వెంటనే వద్దామనే అనుకుంటున్నా అన్నాడు. సరే అయితే , ఒక టీ త్రాగిపోరా అన్నారు మాస్టారు. శ్రీను హాయిగా మాస్టారి డబ్బులతో ఒక టీ తాగేసి చెక్కేశాడు. మరలా వారం రోజుల తర్వాత మనోడు మాస్టారికి కనబడ్డాడు. ఏరా రాలేదు ట్యూషన్ కి అన్నారు మాస్టారు. రేపటినుండి వద్దామనుకుంటున్నా అన్నాడు మనోడు. సరే, టీ త్రాగిపోరా అన్నారు మాస్టారు. రెండోసారి కూడా హ్యాపీగా మాస్టారి డబ్బులతో టీ త్రాగేశాడు మనోడు. తర్వాత 10రోజులకి మనోడు మాస్టారికి మల్లమ్మ సెంటర్లో మరలా కనబడ్డాడు. ఏరా ఇంకా ట్యూషన్ కి  రావడంలేదు అన్నారు మాస్టారు. ఏంలేదు సార్, మంచిరోజు చూసుకుని వెళ్లమంది మా అమ్మ. ఎల్లుండి నుండి వద్దామనుకుంటున్నా అన్నాడు శ్రీను. మరలా మాస్టారు యధావిధిగా తన డబ్బులతో టీ త్రాగించారు. అంతే !  అప్పటినుండి వాడు మాస్టారికి కనబడకుండా తిరిగేవాడు. పాపం మాస్టారికి మూడు టీలు బొక్క! ఇక ఇంగ్లీషు చెప్పే కాశీ మాస్టారికి పెద్ద బొజ్జ ఉండేది. కానీ ఆయన దగ్గర చాలామంది ట్యూషన్ చదివేవాళ్లం కాబట్టి ఆయనకు నిక్ నేమ్ పెట్టే సాహసం చేయలేదు.
                                            
                                          కొత్త బిల్డింగ్ (నాటి హెడ్మాస్టర్-ఆఫీస్ బ్లాక్)
                                          దానివెనుక పాత బిల్డింగ్
                                 బిల్డింగ్ నిర్మాణంలో జాప్యం ఫలితంగా క్రింద కూర్చున్న విద్యార్ధులు




                                     
నరసరావుపేట పూర్వవిద్యార్ధులవేదిక-nrt85 సభ్యులు
నర్సింహారావు,భాస్కర్,నాగేశ్వరరావు
  తిరుమలేశ్వరరావు, అరవపల్లి.శ్రీను

ఇక పల్నాడు ప్రాంతంలోనే ప్రసిద్ధిగాంచిన మా  స్కూల్లోని గురజాడ కళామందిరం  విశేషాలు చూద్దాం.  

గురజాడకళామందిరం ముందు nrt85బ్యాచ్ మేట్స్

ఈ వేదికపై ఎంతోమంది గొప్ప వ్యక్తులు చారిత్రాత్మక నాటికలు ప్రదర్శించారు.  చింతామణి, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు గొప్ప కళాకారులు ప్రదర్శించేవారు. ఆ నాటకాలు చూసేందుకు పిల్లలం, మా దగ్గర డబ్బులేముంటాయి చెప్పండి, అందుకే హైస్కూల్ వెనుక బజారులోని కందుకూరు వీరేశలింగం ఎలిమెంటరీ స్కూల్ లోంచి గోడదూకి పోయి , నాటకం చూసే వాళ్లమి. ఈ నాటకాలకీ పల్నాడు ఫాక్షన్ కీ ఉన్న ఒక లింకు నాకు బాగా గుర్తుంది. కరెక్టు డేటు ,సంవత్సరం గుర్తులేవు గానీ, మున్సిపల్ హైస్కూల్లో జరిగే నాటకం చూసేందుకు వచ్చిన  ఒక నాయకుడిని ప్రత్యర్ధి వర్గం వాళ్లు కాపు కాసి పల్నాడుబస్టాండు దగ్గర చంపివేశారు. ఆ రోజూ అంతా హడావిడి. ఆ తర్వాత మామూలే. అలాగే మా ఊర్లో శ్రీరాంపురంలో మా పాతింటి దగ్గర ఎలక్షన్ మరుసటి రోజున  ముందురోజు పోలింగ్ బూత్ ల్లో ఎత్తుకొచ్చి  పగలగొట్టిన  బ్యాలెట్ బాక్సుల్లోంచి బ్యాలెట్ పేపర్లు చిందరవందరగా రోడ్డునిండా పడిఉండేవి. మాఇంటి దగ్గర్లో పోస్టాఫీసుబడి పెద్ద పోలింగ్ బూత్ కాబట్టి.  అమ్మో , ఇంక వద్దులెండి మా ఊరి ఫాక్షన్ కబుర్లు.  
మున్సిపల్ ఆఫీస్ గాంధిబొమ్మ సెంటర్లో డీలక్స్ టీసెంటర్ 
ఇకపోతే మా ఇల్లు శ్రీరాంపురం లోని పాతపోలీస్ స్టేషన్ ఎదురుగా వద్మావతమ్మ హాస్పిటల్ రోడ్డులో ఉండేది. నేను హైస్కూల్ కి పోవాలంటే ఒక్కోసారి దగ్గరదారిలో పోయేవాడిని. ఎలాగో ఊహించండి. ఏం లేదండీవరవకట్ట మీదుగా వచ్చి  మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా డీలక్స్ టీ సెంటర్  ఉండేది. దాని వెనుక గవర్నమెంట్ హాస్పిటల్ గోడ ఉండేది. దాని మీదుగా హాస్పిటల్లోకి దూకి, హాస్పిటల్ మెయిన్ గేటులోంచి ఎదురుగా ఉండే మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లేవాడిని.  నాకు చిన్నప్పటినుండీ దుముకుడు మనస్తత్వం అనుకుంటున్నారు కదూ , ఇదంతా చదివి !  కొంతవరకు నిజమే అనుకోండి!! 

 ఇక స్కూల్లో చెట్లక్రింద వంగుళ్లు-దూకుళ్లు గురించి చెప్పే పనే లేదు. ఖాళీ దొరికితే అదేపని. ఆ చెట్లు ఇప్పుడు కూడా గర్ల్స్ హైస్కూల్ కొత్త బిల్డింగ్ కీ  వాటర్ ట్యాంక్ కీ మధ్యలో చూడచ్చు క్రింది ఫోటోలో. 

ఇక ఆదివారాలు  అయితే బిళ్లంకోడు ఆడేవాళ్లం గ్రౌండ్ లో. కానీ స్కూల్ మొదట్లోనే  పలకరిస్తున్నట్లుండే వాలీబాల్ మాత్రం మా సీనియర్స్ ఆడుతుంటే అప్పుడప్పుడూ అలా చూస్తుండేవారం. ఇక హైస్కూల్ ఎగ్గొట్టి సినిమాలకెళ్లిన రోజుల గురించి చెప్పేపనే లేదు. సత్యనారాయణ టాకీసు దగ్గర్లోనే ఉండేది కనుక  ఎక్కువగా వెళ్తుండేవాళ్లం.   అప్పట్లో మా సర్కిల్ లో కృష్ణ ఫాన్స్, శోభన్ బాబు ఫాన్స్ ప్రధానంగా ఉండేవారు. మా మున్సిపల్ హైస్కూల్ విద్యార్ధులే ఎక్కువగా రిలీజ్ సినిమాలకు హాల్ దగ్గరికి వెళ్లి బ్యానర్స్ కట్టడం, పోస్టర్లు అతికించడం చేసేవాళ్లు. కానీ ఫాన్స్ పేరుతో కొట్టుకునేంత లేదులెండి! పాపం, నాతో ఆ రోజుల్లో కృష్ణ ఫ్యాన్స్ లో యాక్టివ్ గా తిరిగిన షరీఫ్ అనే అప్పటి క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడని ఇటీవల తెలిసినప్పుడు చాలా బాధేసింది. అలాగే శివరాత్రికి చిన్న చిన్న ప్రభలు స్వంతంగాతయారుచేసుకుని కోటప్పకొండకు 11కి.మీ లాక్కుంటూ వెళ్లినరోజులు కూడా మున్సిపల్ హైస్కుల్ రోజులతో ముడిపడివున్నవే. నరసింహారావూ, నేనూ కలిసి ప్రభ తయారుచేసుకుని కోటప్పకొండకెళ్లి పువ్వాడ గాడి క్యారియర్ లాక్కుని తినేసినందుకు  చాలా సంవత్సరాలు వాడూ మేమూ మాట్లాడుకోలేదు. ఇటీవల నరసరావుపేటలో కలిస్తే క్లాత్ షోరూంలో కూర్చున్న పువ్వాడ.శివనాగేశ్వరరావు మా ఇద్దర్నీ టీ త్రాగేదాకా వదల్లేదు. ఇకపోతే ఇటీవలి మా  సిల్వర్ జూబ్లి మీట్ కోశాధికారిగా వ్యవహరించిన గొడవర్తి.తిరుమలేశ్వరరావుని ఆ రోజుల్లో బంగారు పిచ్చుకఅని నర్సింహారావు మాస్టారు పిల్చేవారు. ఎందుకంటే వాడిది మెయిన్ రోడ్లో పెద్ద బంగారం షాపు కాబట్టి. ఇంకొకడు ఊటూకూరి.వెంకయ్య. వాడికి నర్సింహారావు మాస్టారు పెట్టిన పేరు దొంగ స్వాములు”. ఎందుకంటే వాడు ఒకసారి స్కూల్ కు  రాలేదేందిరా అంటే ఇలా చెప్పాడు. మా ఇంటికి నిన్న పెద్ద స్వాములవారు వచ్చారు. పూజా కార్యక్రమాల వల్ల రాలేదు అన్నాడు . అందుకని మాస్టారు అరే దొంగస్వాములుఅని పిల్చేవారు. ఇక హైస్కూల్ రోజుల్లో హైస్కూల్ ఎగ్గొట్టి లింగంగుంట్ల కాలువలో ఈత కొట్టడానికి మా నాన్న ఇచ్చిన పాత హంబర్ సైకిల్ పై ముగ్గుర్ని ఎక్కించుకుని పోయిన జ్ఞాపకాలు కూడా చెప్పాలి. ఈత కొట్టి వస్తే కళ్లు ఎర్రపడేవి. నేను నిజం చెప్పకపోతే, మా అమ్మకి అనుమానం వస్తే నిక్కర్ లోపల మొలత్రాడు పట్టుకుచూసేది. మొలతాడంతా ఈతకొట్టి వచ్చాక చాలాసేపు తడిగానే ఉండేదికదా! అలా దొరికిపోయేవాడిని.      ఇవన్నీ ముగిసి రఘరామయ్య కాలేజిలో  ఇంటర్ బై.పి.సి,, గుంటూరు మెడికల్ కాలేజిలో మెడిసిన్, తర్వాత వైద్యవృత్తి., అలా అలా కాలచక్రం గిర్రున పాతికేళ్లు తిరిగాక  ఇటీవలే డిసెంబర్ 19, 2010 నాడు nrt85 సిల్వర్ జూబ్లి మీట్ జరిపాము. ప్రధానంగా 84-85లో 10తరగతి మున్సిపల్ హైస్కూల్లో (ఇతర హైస్కూల్స్ లో చదివిన వాళ్లని కూడా ఆహ్వానించామనుకోండి) చదివిన వారు ప్రతినిధులుగా 200మందికి పైగా హాజరయ్యారు.


రామకోటి మాస్టారు,ప్రసాదరావు మాస్టారు
జ్యోతి మేడమ్,భారతీమేడమ్, లంకా మాస్టారు
రంగదొరై మాస్టారు  -  nrt85 బ్యాచ్ విద్యార్ధులు


 
ఆర్గనెజర్స్ నర్సింహారావు,డా.శివబాబు,డా.ఆనంద్,భాస్కర్

 పల్నాడురోడ్డులోని జి.ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మీటింగ్ అనంతరం మేమంతా ప్రదర్శనగా మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లి  పాతికేళ్ల క్రితం నాటి మా మధురజ్ఞాపకాల్ని నెమరేసుకున్నాము. మగపిల్లల హైస్కూల్లో ఇప్పటికీ ఆరు సంవత్సరాలనుండి బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  పదోతరగతి పిల్లలకు కూడా పరీక్షలు వ్రాసేందుకు బెంచీలు లేవు.  ప్రస్తుతం హెడ్ మిసెస్ . జ్యోతి మేడమ్ రిక్వెస్ట్ మేరకు మా nrt85  బ్యాచ్ తరపున 5బెంచీలు, 5గురికి  1,116రూ.  మెరిట్ స్కాలర్ షిప్ బహుకరించాము. అలాగే రానున్నకాలంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిసంవత్సరం ఈ  మెరిట్ స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు ఒక రిజర్వ్ ఫండ్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించాము. అయితే కేవలం మేము కేవలం ఆర్ధిక సహాయం చేయడంతో పరిమితం కాకుండా , మున్సిపల్ హైస్కూల్ ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ప్రజల, అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసేందుకు ఇంకో కార్యక్రమం అదేరోజు చేశాము. మున్సిపల్ హైస్కూల్ సందర్శన అనంతరం ప్రతినుధులందరం ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ ఆఫీసు సెంటర్లో ఉన్న మహాత్మాగాంధి విగ్రహానికి ఒక వినతిపత్రం ఇచ్చి , మా స్కూల్ సమస్యలు పరిష్కరించమని నినాదాలు చేశాము.

మున్సిపల్ హైస్కూల్ సమస్యలు పరిష్కరించాలని
గాంధివిగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

దానికి కొనసాగింపుగా మున్సిపల్ హైస్కూల్ సమస్యలపై సర్వే చేసి, పత్రికా ముఖంగా ప్రజలు,అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా nrt85 విద్యార్ధులుగా మేం చొరవ తీసుకోవడం జరిగింది. గ్రీవెన్స్ సెల్ లో ఎం.ఆర్.ఓ, ఆర్.డి.ఓ. దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఫలితంగా కొంత మెరుగుదల కనిపించింది.
హెడ్మిసెస్ జ్యోతి మేడమ్ తో సమస్యలు 
తెలుసుకుంటున్న nrt85 విద్యార్ధులు


 ఏదైతేనేం , ఇప్పటికి మున్సిపల్ హైస్కూల్ బిల్డింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది వ్రాసే నాటికి రంగులు, కిటికీలు,కరెంటు పనులు కూడా చకచకా సాగుతున్నాయి.


 నాలాంటి, మా సహచరులలాంటి  ఎంతోమంది అసంఖ్యాకమైన వ్యక్తుల్ని ఈ సమాజానికి విద్యావంతులుగా అందించిన మా నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ ఎప్పటికీ చరిత్రలో సగర్వంగా నిలబడాలని మా అందరి కోరిక. ప్రభుత్వరంగ విద్యాలయాలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం చోటుచేసుకుంటున్న నేటిసమాజంలో ఒక చారిత్రక స్ఫూర్తిగా ఎప్పటికీ   మా మున్సిపల్ హైస్కూల్ నిలవాలని మా ఆశ. అందుకోసం ఈ నరసరావుపేట పూర్వ విద్యార్ధుల వేదిక ఎప్పటికీ కృషి చేస్తుందని మీ అందరికీ మా హామీతో ముగిస్తున్నాను.

పోస్ట్ స్రిప్ట్ :  పైన పేర్కొన్నవన్నీ యదార్ధ సంఘటనలే. పైన పేర్కొన్న వారిలో  కొందరు ఉపాధ్యాయులు ఈ కాలంలో  మరణించడం జరిగింది. మేము సిల్వర్ జూబ్లి మీట్లో ప్రధమంగా చేసిన పని మరణించినవారి స్మత్యర్ధం శ్రద్ధాంజలి ఘటించడం. పేర్లు , నిక్ నేమ్స్ పేర్కొనడం ఆప్యాయతతో, అనుబంధంతోనే తప్పించి , వేరే ఉద్దేశ్యంతో కాదని చదువరులకు మనవి. మర్చిపోయానండీ, అంతర్జాతీయ తెలుగు మాసపత్రిక "విజ్ డమ్" వ్యవస్ధాపక సంపాదకులు,  నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్   మాజీ విద్యార్ధి శ్రీ కె.వి.గోవిందరావు గారు స్వయానా మా పెద్దనాన్న గారే!


6, ఫిబ్రవరి 2011, ఆదివారం

మున్సిపల్ హైస్కూల్ కు బెంచిల బహుకరణ -వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు - nrt85 పూర్వవిద్యార్ధులకు హెడ్ మిసెస్ ప్రశంసలు

మిత్రులారా,
nrt85 సిల్వర్ జూబ్లి సమ్మేళనం సందర్భంగా మున్సిపల్ హైస్కూల్ కు  మనం ఇచ్చిన వాగ్ధానం మేరకు మన స్ధానిక మిత్రులు 5బెంచిలు ఇటీవలనే హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ సమక్షంలో అందజేశారు. నాగసరపు.నరసింహారావు, తిరుమలేశ్వరరావు, మేకల.నాగేశ్వరరావు, మిట్టపల్లి.భాస్కర్,అరవపల్లి.శ్రీను తదితరులను ఈ సందర్భంగా ఫోటోలో చూడచ్చు. ఇంకో మంచి విశేషమేమిటంటే మనం ప్రారంభించిన వేళా విశేషం లాగ, మన స్ఫూర్తితో అనుకోవచ్చు, ఇంకొందరు వచ్చి వాళ్ల సంవత్సరపు సహచరులందరి లిస్టులు తీసుకున్నారని జ్యోతి మేడమ్ చెప్పారట. వాళ్లు కూడా మనలాగే పూర్వవిద్యార్ధుల సమ్మేళనాలు జరుపుకోడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. nrt85బ్యాచ్ వాళ్లకే ఈ క్రెడిట్ దక్కుతుందని జ్యోతి మేడమ్ వ్యాఖ్యానించారంటే మనకు సంతోషమే కదా! అదేవిధంగా మున్సిపల్ హైస్కూల్ సమస్యల్ని మన బ్యాచ్ స్ధానిక మిత్రులు పత్రికలు, సర్వేలు ద్వారా ప్రజలు , అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా గత ఆరేళ్లుగా  నత్తనడక నడుస్తున్న హైస్కూల్ భవననిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో నెలలోగా నూతన భవనాన్ని స్వాధీనపరుస్తారనే విశ్వాసాన్ని హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ వ్యక్తంచేశారు.ఇదికూడా మనందరికీ సంతోషదాయకం. మన పూర్వవిద్యార్ధి బెంగుళూరులో ఉంటున్న  దండంరాజు.రాము ప్రకటించిన మూడు స్కాలర్ షిప్పులు ఈ మార్చిలో జరుగనున్న ఫైనల్ పరీక్షల్లో మెరిట్ విద్యార్ధులకు బహుకరించనున్నట్లు హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ తెలియజేశారు. కొందరు లాయర్స్  హైస్కూల్ సమస్యల పట్ల స్పందించి హెడ్ మిసెస్ ను కలిసి తమ సంఘం తరపున సుమారు లక్ష రూపాయల వరకు వివిధ రూపాల్లో సహాయమందిస్తామని హామీ ఇచ్చారట. ఈ విధంగా nrt85 పూర్వవిద్యార్ధుల వునంసమ్మేళనం నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ అభివృద్ధికి దోహదం చేయడం మనందరం గర్వించదగ్గ విషయం. భవననిర్మాణ పనులు వేగంగా జరుగుతూ , కిటికీలు, దర్వాజాలు , రంగులు వేసే పనులు కూడా వేగంగా జరుగుతుండటం ఈ క్రింది ఫోటోల్లో చూడచ్చు.