14, మార్చి 2011, సోమవారం

1968-69 XII-A సెక్షన్ పూర్వవిద్యార్ధుల బ్యాచ్ మరియు నాటి టీచర్ల ఫోటో

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో 
1968-'69  హైయ్యర్ సెకండరి మల్టిపర్పస్  తరగతి విద్యార్ధుల 
బ్యాచ్ మేట్స్ మరియు టీచర్స్ ఫోటో

పై ఫోటో జాగ్రత్తగా చూడండి. XII A  అని కనబడుతుంది. అంటే 12వ తరగతి  "ఎ" సెక్షనన్నమాట. 
నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో  ఒకప్పుడు 12వతరగతి కూడా  ఉండేదన్న విషయం నాకూ ఇప్పుడే తెలిసింది .
ఈ ఫోటో పంపిన మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధి శ్రీ.పాటిబండ్ల.హరికుమార్ గారిద్వారా.  ఆ రోజుల్లో అంటే 1968-69 బ్యాచ్ ఫోటో ఇది.  సుమారుగా నాలుగైదు బ్యాచ్ లకు మాత్రమే పరిమితమై తరువాత రద్దు చేయబడ్డ ఈ హైయ్యర్ సెకండరి మల్టిపర్పస్ కోర్సు 12వ తరగతితో (అంటే నేటి ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ తో సమానమన్నమాట) సమానం. 1964-65 ల నుండి 1969-70ల వరకూ కొనసాగిన ఈ కోర్సులో పదవతరగతి, పదకొండో తరగతి తర్వాత పన్నెడో తరగతికి డైరెక్టుగా పబ్లిక్ పరీక్షలు ఉండేవట.  ఈ పరీక్ష ప్యాసనయిన వారు నాడు డిగ్రితో సమానమైన కోర్సులన్నిటికీ అర్హత సాధించినట్లు. వారు సరాసరి డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చునట ఆ రోజుల్లో. కానీ పరీక్షలు  కష్టంగా ఉండి ప్యాసయ్యే విద్యార్ధుల శాతం తక్కువగా ఉండడంతో  తర్వాత ఈ కోర్సు రద్దుచేయబడి మరలా యధాతధంగా s.s.l.c, puc పద్దతిగా మార్చారట. 
 ఇకపోతే ఈ బ్యాచ్ విశేషాలు చూడండి. కూర్చున్న వారిలో టీచర్స్ అందరినీ దాదాపుగా హరికుమార్ గారు గుర్తుపట్టి చెప్పారు. కొందరిని మనం కూడా గుర్తుపట్టవచ్చు. వారు ఎడమప్రక్కనుండి వరుసగా 
1.జాన్ మాస్టారు (డ్రాయింగ్) 2.రంగదొరై మాస్టారు (సంస్క్రతం) 3.అప్పారావు మాస్టారు (డ్రిల్) 4.సంతోషం మాస్టారు (తెలుగు) 5.గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు (క్లాస్ టీచర్) 6.ఎన్.సి.ఆంజనేయులు మాస్టారు (హెడ్మాస్టర్) 7.బంగారేశ్వరశర్మమాస్టారు (అసిస్టెంట్ హెడ్మాస్టర్) 8.ఫిజిక్స్ మాస్టారు 9.సోమయాజులు మాస్టారు (ఇంగ్లీషు) 10.మస్తాన్ రావు మాస్టారు (ఎన్.ఎస్) 11.రామకోటి మాస్టారు (ఇంగ్లీషు)  12.రాయపాటి.సుబ్బారావు మాస్టారు (హిందీ)

ఈ బ్యాచ్ లో చదివిన విద్యార్ధులలో  కొందరి గురించి  ప్రస్తుతానికి లభ్యమైన వివరాలు  ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ ఫోటో పంపింన నాటి పూర్వవిద్యార్ధి శ్రీ.పాటిబండ్ల.హరికుమార్ గారు ఫోటోలో చివరి వరుసలో ఎడమనుండి 4వ వారు.    2009లో టెకుమ్సే ఇండియా ప్రై.లి. లో ఫైనాన్స్ మేనేజర్ గా రిటైరయ్యి ప్రస్తుతం హైదరాబాద్ లో పాతబోయిన్ పల్లిలో ఉంటున్నారు.అదే వరుసలో ఎడమనుండి 2వ వారు శ్రీ. కాకుమాను పెదపేరిరెడ్డి . మనందరికీ సుపరిచుతులైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నాటి అసిస్టెంట్ హెడ్ మాస్టర్ శ్రీ. బంగారేశ్వరశర్మ గారబ్బాయి శ్రీ.చల్లపిళ్ల.శర్మ గారు ప్రస్తుతం బి.హెచ్.యి.ల్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు.  నాటి మరొక పూర్వవిద్యార్ధి శ్రీ.డి.బి.శాస్త్రి గారు కూడా రిటైరయ్యి  ప్రస్తుతం దిల్ సుక్ నగర్ లో  చింతలూర ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. మరొక పూర్వవిద్యార్ధి శ్రీ. సూర్యనారాయణరెడ్డి గారు హెచ్.ఎం.టిలో పనిచేశారు. మరొక పూర్వవిద్యార్ధి శ్రీ.మంగళంపల్లి.నారాయణ గారు హైదరాబాద్ లోని హిందూస్ధాన్ యాంటిబయాటిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు. 
నాడు కొందరు గర్ల్స్ కూడా XII A  సెక్షన్ లో ఉండేవారట. వారే క్రింద వరుసలో కూర్చున్నవారు.

పోస్ట్ స్రిప్ట్ : ఈ పోస్ట్ లో ఫోటో గురించిన మరిన్నివివరాలు   అందుబాటులో ఉన్నవారు తెలియజేయగలరు.

9, మార్చి 2011, బుధవారం

మున్సిపల్ హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ.గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నివాళులు

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్  ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది సంవత్సరాలుగా తన దత్తత కుమారుడైన గడ్డం.హరిబాబు(పేటలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు) గారి దగ్గరే ఇంట్లోనే వైద్యపరివేక్షణలో  ఉంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్లో మేము nrt85 సిల్వర్ జూబ్లి మీట్ కు  ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయన్ను కలిసి మాట్లాడేందుకు ఆయన అనారోగ్య కారణాలవల్ల  సాధ్యం కాలేదు. ఇంతలోనే నిన్న ఉదయం (09-03-2011) ఆయన మరణించినట్లు వార్త తెలిసింది. గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు నరసరావుపేట స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. పట్టణంలో అందరికీ సుపరిచితులైన ,  మున్సిపల్ హైస్కూల్ లో మా పూర్వఉపాధ్యాయులు మరియు  హెడ్ మాస్టర్ గా రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నరసరావుపేట వూర్వ విద్యార్ధుల వేదిక నివాళులర్పిస్తోంది.

3, మార్చి 2011, గురువారం

మహాశివరాత్రి తిరనాళ్లకు కోలాహలంగా కోటప్పకొండ- నరసరావుపేట పరిసరాలు

మహాశివరాత్రి...... ఈ పదం వినగానే కోటప్పకొండ గుర్తుకొస్తుంది ఎవరికైనా.
దాంతోపాటు నాటి  ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని పాట
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా           ఆరుబయట ఎండలో - సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే కన్నుకన్ను కలిపేస్తే              నూటొక్కటెంకాయ కొడతానని....
బుచ్చిబాబు కనిపిస్తే నాకోసం పడిచస్తే              నూటొక్కటెంకాయ కొడతానని.........
కన్నెపిల్ల – బుచ్చిబాబు సంగతెలా వున్నా , నరసరావుపేట యువతకు మాత్రం నేటికీ  శివరాత్రి తిరనాళ్లంటే ఎక్కడలేని ఉత్సాహం  పుట్టుకొస్తుంది. చిన్న పిల్లలు  తయారుచేసుకునే బుల్లి ప్రభలనుండి  పోటాపోటీగా తయారుచేసే  ఆకాశాన్నంటేటట్లుండే పెద్ద కరెంటు ప్రభల దాకా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు కనువిందు చేస్తాయి.
                                 
                           కొండదగ్గర  కొలువుదీరిన  ప్రభలు
                                  బ్రహ్మంగారి గుడి వీధిలో ప్రభ

                                 పాతూరి ఆంజనేయస్వామి గుడి దగ్గరి ప్రభ

                                     మానికలబావి వీధిలో ప్రభ                          

                      మానికలబావి వీధిలో ప్రభముందు యువత కోలాహలం


                              బుల్లి బుల్లి ప్రభలతో చిన్ని చిన్ని పిల్లలు
                   
ప్రొద్దున్న మొదలుకుని రాత్రి దాకా  పలు వీధుల్లో తయారుచేసిన ప్రభలు ముందుగా డప్పులు, నృత్యాలు, బాణాసంచా కోలాహలంతో  కోటప్పకొండకు బయలుదేరాయి. యధావిధిగా మా పాతింటి దగ్గర ., అంటే  శ్రీరాంపురం, బ్రహ్మంగారిగుడి వీధి లో ప్రభలు,  ఇప్పటి మా ఇల్లున్న బరంపేట,శివునిబొమ్మ సెంటర్ నుండి కూడా ఉత్సాహంగా ప్రభలు బయలుదేరాయి. అయితే ఈసారి మాత్రం కొన్ని గ్రామాల, వీధుల పెద్ద ప్రభలు స్ధానికంగా తయారు కాకుండా కొండవద్దనే తయారుచేయబడ్డాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలనుండి ప్రభల్ని తీసుకెళ్లేటప్పుడు దారిలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ఇబ్బందులెదుర్కుంటున్నారు కనుక. ఇక కోటప్పకొండ దగ్గర సీన్ చెప్పాల్సిన పనిలేదు.    చేదుకో కోటయ్యా-ఆదుకో కోటయ్యాఅంటూ భక్తజనం  పరవశంతో  చేసే  నినాదాలతో త్రికోటేశ్వరకొండ దద్దరిల్లింది. కాలినడకన వెళ్లే జనం, ఘూట్ రోడ్డ్ లో వెళ్లే  వాహనాలలో  జనం ., వెరసి  ఎక్కడ చూసినా  జనం .. జనం..    కోటయ్యకొండతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన పర్యాటక కేంద్రం కూడా జనంతో కిటకిటలాడిపోయింది.


తిరనాళ్ల జనసందోహం

పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కొండపై నాగేంద్రుని పుట్ట


  మా చిన్నప్పుడు ప్రొద్దున్నే కాలినడకన నరసరావుపేట నుండి చిన్న ప్రభ కట్టుకుని యలమంద మీదుగా, గురవాయపాలెంలో మా ఫ్రెండ్స్ ని కూడా కలుపుకుంటూ కోటప్పకొండ చేరిన రోజులు మర్చిపోలేం. మెట్లమార్గంలోనే కాక, కొండపైన ఇంకా పైన కొలువుదీరిన పాతకోటయ్య స్వామి దగ్గరకు రాళ్లగుట్టల్లోంచి , చెట్ల పొదల్లోంచి రొప్పుకుంటూ పోయిన రోజులు మరపురానివి-మధురమైనవి. అర్ధరాత్రి దాకా మామూలుగా ఉండే వాతావరణం అర్ధరాత్రి తర్వాత  ఆరోజుల్లో వేసే రికార్డు డాన్స్ షోల ప్రారంభంతో ఉన్నట్లుండి వేడెక్కేది.  తర్వాతకాలంలో నిషేధించబడ్డప్పటికీ, చాలాకాలం పాటు మా చిన్నతనంలో మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లేటప్పుడు వరవకట్ట నుండి మసీదు సెంటర్ మీదుగా గడియారస్తంభం సెంటర్ కు వెళ్లే మార్గంలో  డ్యాన్స్ పార్టి బోర్డులు , ఆ పేర్లు ఇప్పటికీ అలానే గుర్తున్నాయి.

అలంకరణతో శివునిబొమ్మ సెంటర్లో మహాశివుడు

క నరసరావుపేట పట్టణంలో శివరాత్రి సందర్భంగా కనబడే కొన్ని విశేషాలు  జగత్ప్రసిద్ధమే.  పిల్లల ఆటవస్తువుల దుకాణాలు, తినుబండారాల దుకాణాలు, మార్కెట్ సెంటర్లో చెరుకుగడల కుప్పలు ., ఇక మామూలురోజుల్లో కేవలం నాలుగు షోలు ప్రదర్శించబడే సినిమాల్ని  శివరాత్రిరోజు   వీలైనంత ఎక్కువ స్పీడు తిప్పి – కొన్ని సీన్లు కట్ చేసి మరీ  ఒక్కో సినిమా 24గంటలూ నాన్ స్టాప్ గా ఏడెనిమిది షోలు ప్రదర్శించడంలో పోటీపడే సినిమాహాళ్లు .,  ఇదీ పరంపర.,

           ఏదైనా అరుదుగా జరిగితే   .. జన్మకో శివరాత్రి అంటుంటారు.  కానీ  మా ఊర్లో  ఏడాదికో సారి వచ్చే శివరాత్రి మాత్రం నిజంగా చాలా ప్రాధాన్యత కల్గిందనటంలో సందేహం లేదు.