26, డిసెంబర్ 2011, సోమవారం

విజయవంతంగా ముగిసిన 1985-86 పదవతరగతి పూర్వవిద్యార్ధుల సమ్మేళనం

1985-86 వ బ్యాచ్ మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం 24-12-2011(శనివారం) నాడు  ఘనంగా జరిగింది. స్ధానిక రామిరెడ్డిపేటలోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కలయికకు 400మందికి పైగా పూర్వ విద్యార్ధులు  హాజరయ్యారు. నాడు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను సన్మానించుకుని , తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎంతో ఉల్లాసంగా, ఉద్వేగంగా జరిగిన ఈ కలయికకు నాడు విద్యార్ధులుగా ఉండి నేడు  సమాజంలో ప్రముఖస్ధానాల్లో ఉన్న పలువురు హాజరయ్యారు. ప్రవాస భారతీయుడు , సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నంద్యాల.కోటిరెడ్డి, సాఫ్ట్ వేర్ నిపుణులు జితేంద్ర చక్రవర్తి, చంద్రశేఖర్, వైద్యులు జి.శ్రీనివాసరావు, నీలిమ , స్టేట్ బ్యాంకు అధికారి సోము.వెంకటరమణ , ఇంకా పాలపర్తి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


  ఈ సమావేశంలో సమాజానికి తమవంతు సాయం తాము చేసేందుకై " నేస్తం " ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పరుస్తున్నట్లు పూర్వవిద్యార్ధుల తరపున నంద్యాల.కోటిరెడ్డి  ప్రకటించారు. నరసరావుపేట పట్టణంలో తమతోపాటు చదువుకుని, నేడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి సహాయం చేయడం, మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించడం వంటివి ఈ ట్రస్టు చేస్తుందని వివరించారు. 
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను - అని శ్రీశ్రీ అన్నట్లు నరసరావుపేట పట్టణ మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులందరూ నేడు గర్వించదగ్గ స్ధానాల్లో ఉండి, తమవంతు సాయం తాము సమాజానికి చేస్తున్నందుకు గర్విస్తూ,  వారందరికీ మన  ఈ   బ్లాగు తరపున  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

7, డిసెంబర్ 2011, బుధవారం

1985-86 X class batch silver jubilee meet

నరసరావుపేట లొని అన్ని ఉన్నత పాఠశాలల్లొ (హైస్కూలు) చదివిన 1985-86 బ్యాచ్ పదవ తరగతి విద్యార్ధుల పున: సమ్మేళనం 24-12-2011 నాడు 10:00 AM నుంచి 05:00 PM వరకు నరసరావుపేట లొని సన్నిధి ఫంక్షన్ హాలు (రామిరెడ్ది పెట) లొ నిర్వహించబడును. వివరములకు సంప్రదించండి రాము @ 98492 86794.

12, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉత్సాహంగా జరిగిన మున్సిపల్ హైస్కూల్ 1982-83 పదవతరగతి విద్యార్ధుల పునసమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి 1982-83 బ్యాచ్ పూర్వవిద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. 11-09-2011(ఆదివారం) ఉదయం 8గం.లనుండి సాయంత్రం 7గం.ల వరకు జరిగిన ఈ సమ్మేళనంలో దాదాపు 150మంది పూర్వవిద్యార్ధులు వారి కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించుకుని, మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకుని పరవశులయ్యారు.

క్రింది సాక్షి పేపర్ క్లిప్పింగ్ లో మరిన్ని వివరాలు చూడండి






4, సెప్టెంబర్ 2011, ఆదివారం

మున్సిపల్ హైస్కూల్ 1982 -' 83 బ్యాచ్ పదవ తరగతి పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం

మిత్రులారా,

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ 10వతరగతి పూర్యవిద్యార్ధుల పునసమ్మేళనాలు ఉత్సాహకరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాచ్ ల పూర్వవిద్యార్ధుల కలయికలు జరిగాయి.  ఇప్పుడు తాజాగా 1982-'83 బ్యాచ్ విద్యార్ధుల సమ్మేళనం జరుగనుంది. ది.11-09-2011(ఆదివారం) నాడు జరుగనున్న  ఈ సమ్మేళనంలో దాదాపు 300మంది పాల్గొననున్నారని అంచనా.ఈ మీట్   స్ధానిక ప్రకాష్ నగర్ లోని యర్రంశెట్టి ఫంక్షన్ ఫ్లాజా లో జరుగనుంది.
నాటి  ఉపాధ్యాయులందరూ ఆహ్వానితులుగా పాల్గొననున్న ఈ కలయిక ఆదివారం అనగా 11వతేది ఉదయం 8గం.ల నుండి సాయంత్రం 5గం.ల వరకు జరుగనుంది. ఈ సమావేశాన్ని నాటి పూర్వవిద్యార్ధులు శ్రీ.బి.కామేశ్వరశాస్త్రి, కొత్త.రామకృష్ణ(సింధు స్కూల్), కొత్త.సీతారామాంజనేయులు, పెనుగొండ.ప్రభాకర్, కపలవాయి.శివప్రసాద్, కటకాల.మారూతిప్రసాద్, కప్పగంతుల.మోహన్ కుమార్, మునగా.వేణుమాధవ్, కూరపాటి.గుప్త ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. 

1, ఆగస్టు 2011, సోమవారం

మున్సిపల్ హైస్కూల్ నూతన హెడ్ మాస్టర్ గా " మహబూబ్" మాస్టారు బాధ్యతల స్వీకరణ

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ శనివారం పదవీవిరమణ చేశారు. అనంతరం సోమవారం (01-08-2011) నుండి మహబూబ్ మాస్టారు పూర్తిస్ధాయి హెడ్ మాస్టర్ గా ఛార్జి తీసుకున్నారు. సీనియారిటి ప్యానెల్ ప్రకారం హెడ్మాస్టర్ గా బాధ్యతలు తీసుకున్న మహబూబ్ మాస్టారు ప్రస్తుతం ఇంకో రెండు సంవత్సరాలు కొనసాగుతారు. గతంలో మున్సిపల్ హైస్కూల్ నుండి కొంతకాలం బరంపేట హైస్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేసి, మరలా ఇప్పుడు మున్సిపల్ హైస్కూల్లో పనిచేస్తూ హెడ్ మాస్టర్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన మహబూబ్ మాస్టారు మనందరీకీ మృదుస్వభావిగా చిరపరిచితులే. నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక పోయినేడాది నిర్వహించిన 1985 వ బ్యాచ్  10వతరగతి పూర్వవిద్యార్ధుల సిల్వర్ జూబ్లి వేడుకల్లో కూడా మహబూబ్ మాస్టారు ఉత్సాహంగా పాల్గొన్న  విషయం మీకందరికీ విదితమే. ఆ సందర్భంలోని  పోటోలు ఈ క్రింద చూడవచ్చు. 




11, జులై 2011, సోమవారం

మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం అధికారిక ప్రారంభం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం   నేడు ప్రారంభించబడింది. స్ధానిక ఎం.ఎల్.ఏ మరియు మంత్రివర్యులు శ్రీ కాసు.కృష్ణారెడ్డి గారు ముఖ్యఅతిధిగా విచ్చేసిన  ఈ కార్యక్రమం ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.పి.జ్యోతి మేడమ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ .శరత్, ఆర్.డి.ఓ.అరుణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావు, మాజీ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు   శ్రీ.నాగేశ్వరరావు, ప్రసాదరావు, వసుంధరాదేవి, బాలు, అప్పారావు, ఈ వేదిక సభ్యులైన నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితర  పూర్వవిద్యార్ధులు  , ఇతర పురప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.
                         
                                  


1, జులై 2011, శుక్రవారం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ నూతన భవన ప్రారంభోత్సవ ఆహ్వానం

మిత్రులారా,
మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం ది.11-07-2011(సోమవారం)నాడు అధికారికంగా ప్రారంభించబడనుంది .  ప్రస్తుత హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ పూర్వవిద్యార్ధులందరినీ ప్రారంభోత్సవానికి   ఆహ్వానించారు. స్ధానికంగా ఉన్న మన మిత్రుడు నరసింహారావుకు మౌఖికంగా తెలియజేశారు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులందరికీ ప్రారంభోత్సవానికి హాజరుకావల్సిందని మనల్ని తెలియజేయమన్నారు.  కనుక మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్ధులందరికీ  నూతన భవన ప్రారంభోత్సవానికి ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది.

30, మే 2011, సోమవారం

అనుభూతుల పందిరిలో జ్ఞాపకాల సంగమంగా 83-84 పదవ తరగతి విద్యార్ధుల సమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ బాయ్స్  హైస్కూల్ లో 1983-84 బ్యాచ్ పదవతరగతి చదివిన విద్యార్ధుల పునసమ్మేళనం ది.29-05-2011 (ఆదివారం) నాడు స్ధానిక జమీందార్ ఫంక్షన్ ప్లాజాలో ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ ఉద్యోగ, వ్యాపారాల్లో స్ధిరపడ్డ  సుమారు 220మంది పూర్వవిద్యార్ధులు కుటుంబాలతో సహా 28ఏళ్ల తర్వాత కలిసుకుని ఎంతో భావోద్వేగంతో పాత మధుర జ్ఞావకాలను నెమరువేసుకున్నారు. నాటి ముచ్చట్లతో, చిన్ననాటి సంఘటనల్ని గుర్తుతెచ్చుకుంటూ  అవధుల్లేని ఆనందోద్వేగాలలో తేలియాడారు. నాడు తమకు చదువులు గరిపిన గురువులను సన్మానించుకుని గురువులపట్ల తమ కృతజ్ఞతా గౌరవాల్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నాటి విద్యార్ధులు పి.రాజశేఖర్, వై.శివాజీ,ఆదినారాయణ,అమర్ నాధ్, సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. ఈ సమ్మేళనంలో   పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు నిర్వహించారు.


సమ్మేళనానికి ఆతిధ్యమిచ్చిన జమీందార్ ఫంక్షన్ ప్లాజా

వేదికనలంకరించిన ఉపాధ్యాయులు


ప్రారంభోపన్యాసం చేస్తున్న నాటి విద్యార్ధి పి.రాజశేఖర్




27, మే 2011, శుక్రవారం

1983-84 పదవ తరగతి మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం

చారిత్రాత్మక నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో  చదివిన మరో బ్యాచ్ పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం రేపు జరుగనుంది. నరసరాపుపేట మున్సిపల్ హైస్కూల్ లో 1983-84 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్ధుల పునసమ్మేళనం ది.29-05-2011(ఆదివారం) స్ధానిక జమీందార్ ఫంక్షన్ హాల్ లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు వారివారి  కుటుంబసమేతంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.  పూర్తి వివరాలు రేపు మీట్ జరిగిన తర్వాత పొందుపర్చగలము.

11, ఏప్రిల్ 2011, సోమవారం

మున్సిపల్ హైస్కూల్ 80-81 బ్యాచ్ పునసమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో 1980-81 లో పదవతరగతి చదివిన విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ది.10-04-2011 (ఆదివారం) నాడు కోలాహలంగా జరిగింది.  దీనిపై  సాక్షి పేపర్ లో వచ్చిన ఐటమ్ ఈ క్రింద చూడండి

10, ఏప్రిల్ 2011, ఆదివారం

1980-81 batch students meet

ఈ రొజు (10-04-2011) నరసరావుపేట లొ మరొ batch పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. మునిసిపల్ హైస్కూల్ 1980-81 (X class) విద్యార్ధుల ఆత్మీయ సమ్మెళనము రామిరెడ్డి పేట లొని "సన్నిధి function హాల్" లొ నిర్వహించబడినది. ఈ సమ్మెళనములొ 15 మంది మునిసిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులను సన్మానించారు. 185 మంది పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు. వివిధ సాంస్క్రుతిక కార్యక్రమాలు ఈ సందర్భంగానిర్వహించబడినవి. 1980-81 batch కి చెందిన ప్రకాష్, రామక్రిష్ణ మరియు జవహర్ లాల్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
     









                                                                                                                                                           













                                                 

5, ఏప్రిల్ 2011, మంగళవారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2011

                                  “ఔషధ నిరోధకతపై పోరాడుదాం
                                    
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా  ప్రజారోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచవ్యాప్తంగా  ప్రజలలోకి తీసుకెళ్లేందుకు  ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక ప్రచార నినాదాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదం ఔషధ నిరోధకత పై పోరాడుదాం . (combat drug  resistance)
ఔషధ నిరోధకత అంటే ఏమిటి ?
బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవులు వంటి రోగకారక జీవులు తమపై ఉపయోగించబడే యాంటిమైక్రోబియల్ మందులు నిష్పలితమైపోయే విధంగా పరిణామం చెందిన పరిస్ధితిని ఔషధ నిరోధకత అంటాము. అంటే ఆయా రోగకారక జీవులు మామూలుగా వాడే మందులకు నశించకుండా, తట్టుకుని జీవించగల్గుతాయి.  ఔషధాలను తట్టుకునే నిరోధక శక్తి రోగకారక జీవులకు లభించిందన్నమాట ! దీన్నే మనం  “ఔషధ నిరోధకత ” (drug resistance) అని పిలుస్తాం.  పలురకాల మందులకు ఔషధ నిరోధకత కల్గిన సూక్ష్మజీవులను సూపర్ బగ్స్ అంటాము. వీటివల్ల  ప్రపంచ మానవాళికి వ్యాధి తీవ్రత, ఆర్ధికభారం ఎక్కువవుతాయి.
ఈ స్ధితి  ఎందువల్ల వస్తుందంటే, విచ్చలవిడిగా , అసంబద్ధంగా యాంటిబయాటిక్స్ ని వాడటం వల్ల.  ఉదాహరణకు ఏదైనా ఒక మందు  తక్కువ క్వాలిటి రకం వాడటం వల్ల లేదా పూర్తి కోర్సు వ్యవధికాలం వాడకపోవడం వల్ల  ఈ పరిస్ధితి రావచ్చు.


ఔషధ నిరోధకత - కొన్ని వాస్తవాలు :
-         ఔషధనిరోధకత కల్గిన జీవుల వలన కలిగే వ్యాధులు మామూలుగా వాడే మందులకు తగ్గకపోవడం వల్ల దీర్ఘకాలంపాటు వ్యాధి దుష్ఫలితాలకు లోనవడం,  మరణాల రేటు కూడా ఎక్కువవడం జరుగుతుంది.
-         ప్రతి సంవత్సరం 4,40,000  బహుళ ఔషధ నిరోధకత కల్గిన క్షయ వ్యాధి కేసులు నమోదవుతూ, 1,50,000 మరణాలకు కారణమవుతున్నాయి. 64దేశాల్లో మొత్తం క్షయ కేసులు  ఔషధ నిరోధకత కల్గినవిగా నిర్ధారించబడటం ఆందోళనకరమైన అంశం.
-         మలేరియా విస్త్రతంగా వ్యాపించివున్న అనేక దేశాలలో మలేరియాకు వాడబడే  క్లోరోక్విన్, సల్ఫడాక్సిన్-పైరిమెధమిన్  వంటి  పాతతరం మందులకు  నిరోధకత  సాధారణమైపోయింది.
-         హాస్పిటల్ ద్వారా సంక్రమించే వ్యాధులలో ఎక్కువ శాతం  తీవ్రమైన ఔషధ నిరోధకత కల్గివుండే  ఎం.ఆర్.ఎస్.ఏ (మెధిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకల్ ఆరియస్) వంటి బాక్టీరియా వల్ల సంక్రమిస్తున్నాయి.
-         అసంబద్ధ, హేతురహితమైన  యాంటిబయాటిక్  మందుల వాడకం   ఔషధ నిరోధకత కల్గిన రోగక్రిములు ప్రబలడానికి, బలపడటానికీ దోహదం చేస్తున్నది.
-         ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన ప్రకారం పిల్లల్లో రక్తవిరేచనాలకు కారణమైన షిజెల్లా వ్యాధికి సిప్రోఫ్లోక్సాసిన్ పనిచేస్తుంది. కానీ అదే సిప్రోఫ్లోక్సాసిన్ ను హేతువిరుద్ధంగా వాడిన ఫలితంగా షిజెల్లా జీవులకు సిప్రోఫ్లోక్సాసిన్ కు  ఔషధ నిరోధకత రావడంతో పరిస్ధితి జటిలమయ్యింది.
-         అతి సాధారణమైన  గనేరియా లాంటి సుఖవ్యాధి కూడా  మాత్రల రూపంలో తీసుకునే  సెఫలోస్పోరిన్స్ అనే మందుని విచ్చలవిడిగా  వాడకం వల్ల ,  క్లిష్టమైన మందులు వాడితే కానీ లొంగని పరిస్ధితి ప్రబలుతున్నది.

 ఔషధ నిరోధకతకు దారితీస్తున్న కారణాలు :
యాంటిబయాటిక్స్  తక్కువ క్వాలిటి వాడకం, పూర్తి కోర్సు వ్యవధి వాడకపోవడం వంటి కారణాలు సాంకేతికంగా ఔషధ నిరోధకతకు దారితీస్తాయి.
దీనితోపాటు ఈ క్రింది అంశాలు కూడా ఔషధ నిరోధకతకు దోహదం చేస్తున్నాయి.
-         జాతీయస్ధాయిలో  చిత్తశుద్ధి లోపించిన ఫలితంగా సమగ్రమైన, సమన్వయంతో కూడిన కార్యాచరణ లేకపోవడం, జవాబుదారీతనం లోపించడం, క్రిందిస్ధాయి ప్రజలను భాగస్వాముల్ని చేసే ప్రణాళికలు లేకపోవడం
-         బలహీనమైన లేదా పనిచేయని స్ధితిలో పర్యవేక్షణ వ్యవస్ధలుండటం
-         క్వాలిటి  మరియు నిరంతరాయంగా మందులు అందుబాటులో ఉండేలా చూసే వ్యవస్ధలు అసంపూర్తిగా ఉండటం
-         ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణల అమలు వైఫల్యం
-         డయాగ్నొస్టిక్స్, మందులు, వాక్సిన్స్ ఉత్పత్తిలో మందగొండితనం, కొత్త ఉత్పత్తుల తయారీకై పరిశోధన మరియు అభివృద్ధి తగినంతగా లేకపోవడం




ఔషధ నిరోధకతను అడ్డుకోవాలి !

నేడు మనిషి ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించగల్గడానికి ఒకానొక కారణం వ్యాధులను నియంత్రించగల్గే  శక్తివంతమైన  ఔషధాల లభ్యత . 1940లో యాంటిమైక్రోబియల్ మందులు కనిపెట్టబడి, లభ్యమయ్యేదాకా  ప్రజలు ఇన్ఫెక్షన్లతో పెద్దఎత్తున మరణిస్తుండేవారు.   నేడు యాంటిమైక్రోబియల్స్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేము.
నేడు మనకు అటువంటి యాంటిమైక్రోబియల్స్ అందించిన శక్తివంతమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్నది. గత 70సంవత్సరాలుగా మానవ, జంతు ప్రపంచంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల వినిమియం ఫలితంగా యాంటిమైక్రోబియల్స్ కు ఔషధ నిరోధకత కల్గివున్న జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తున్నది. ఫలితంగా మరణాల సంఖ్య, అనారోగ్య తీవ్రత , ఆరోగ్యసంరక్షణా వ్యయం అధికమౌతున్నాయి. ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగితే, అనేక ఇన్ఫెక్షన్స్  -   వ్యాధులు  నియంత్రించలేనివిగా మారి  ఇప్పటిదాకా ఆరోగ్యరంగంలో సాధించిన విజయాలు  తారుమారయ్యే దుస్ధితి మానవాళికి దాపురిస్తుంది. పైగా శరవేగంతో విస్తరిస్తున్న దేశాంతర వ్యాపారాలు, ప్రయాణాల వల్ల ఈ ఔషధ నిరోధకత కల్గిన జీవులు గంటలవ్యవధిలోనే విస్తరించడానికి సులువవుతుంది. ఔషధ నిరోధకత పూర్తిగా కొత్త సమస్య కానప్పటికీ, కొన్ని దేశాలు దీని నివారణకు చర్యలు చేపడుతున్నప్పటికీ,  ఔషధ నిరోధకత ఫలితంగా యాంటిబయాటిక్స్ కనుగొనక ముందు రోజుల దుస్ధితిలోకి  మానవాళి నెట్టబడకుండా ఉండాలంటే అన్ని ప్రపంచదేశాల మధ్య సమన్వయంతో కూడిన సమిష్టి కృషి  తక్షణం ప్రారంభం కావల్సివుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ,   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2011 సందర్భంగా ఔషధ నిరోధకతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటినీ కార్యాచరణకు సమాయత్తం చేసేందుకు ఒక
6-పాయింట్ల ప్యాకేజిని ప్రకటించింది.



ఈ ఆరు అంశాలలో బలహీనతలను అధిగమించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది.   

పరిశోధన లేమి
2.                 చిత్తశుద్ధి కొరత
3.                 పర్యవేక్షణ లోపం
4.                 ఔషధ నాణ్యత లోపం
5.                 ఔషధ వినియోగంలో హేతుబద్దత లోపించడం
6.                 ఇన్ఫెక్షన్ నియంత్రణ లోపాలు
ఈ అంశాలపై కేంద్రీకరించి ఔషధ నిరోధకతను పై పోరాడేందుకు సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ  ఈ క్రింది రంగాలలో ఉండేవారికి పిలుపునిస్తున్నది.
-         పాలసీ నిర్ణేతలు, ప్రణాళికా నిర్దేశకులు
-         ప్రజలు, పేషెంట్స్
-         ప్రాక్టీషనర్స్(డాక్టర్స్ .,ఇతరత్రా)
-         ఫార్మసిస్టులు, ఔషధ విక్రేతలు
-         మందుల పరిశ్రమ
ప్రపంచ ప్రజల ఆరోగ్యసంరక్షణకు పెను సవాల్ గా మారనున్న ఈ ఔషధ నిరోధకతను అడ్డుకోవడం తక్షణ  ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఔషధ నిరోధకత గురించి ప్రజలలో విస్త్రతంగా ప్రచారం గావించి , మానవాళికి రానున్న పెనుముప్పుపై పోరాటం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.



14, మార్చి 2011, సోమవారం

1968-69 XII-A సెక్షన్ పూర్వవిద్యార్ధుల బ్యాచ్ మరియు నాటి టీచర్ల ఫోటో

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో 
1968-'69  హైయ్యర్ సెకండరి మల్టిపర్పస్  తరగతి విద్యార్ధుల 
బ్యాచ్ మేట్స్ మరియు టీచర్స్ ఫోటో

పై ఫోటో జాగ్రత్తగా చూడండి. XII A  అని కనబడుతుంది. అంటే 12వ తరగతి  "ఎ" సెక్షనన్నమాట. 
నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో  ఒకప్పుడు 12వతరగతి కూడా  ఉండేదన్న విషయం నాకూ ఇప్పుడే తెలిసింది .
ఈ ఫోటో పంపిన మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధి శ్రీ.పాటిబండ్ల.హరికుమార్ గారిద్వారా.  ఆ రోజుల్లో అంటే 1968-69 బ్యాచ్ ఫోటో ఇది.  సుమారుగా నాలుగైదు బ్యాచ్ లకు మాత్రమే పరిమితమై తరువాత రద్దు చేయబడ్డ ఈ హైయ్యర్ సెకండరి మల్టిపర్పస్ కోర్సు 12వ తరగతితో (అంటే నేటి ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ తో సమానమన్నమాట) సమానం. 1964-65 ల నుండి 1969-70ల వరకూ కొనసాగిన ఈ కోర్సులో పదవతరగతి, పదకొండో తరగతి తర్వాత పన్నెడో తరగతికి డైరెక్టుగా పబ్లిక్ పరీక్షలు ఉండేవట.  ఈ పరీక్ష ప్యాసనయిన వారు నాడు డిగ్రితో సమానమైన కోర్సులన్నిటికీ అర్హత సాధించినట్లు. వారు సరాసరి డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చునట ఆ రోజుల్లో. కానీ పరీక్షలు  కష్టంగా ఉండి ప్యాసయ్యే విద్యార్ధుల శాతం తక్కువగా ఉండడంతో  తర్వాత ఈ కోర్సు రద్దుచేయబడి మరలా యధాతధంగా s.s.l.c, puc పద్దతిగా మార్చారట. 
 ఇకపోతే ఈ బ్యాచ్ విశేషాలు చూడండి. కూర్చున్న వారిలో టీచర్స్ అందరినీ దాదాపుగా హరికుమార్ గారు గుర్తుపట్టి చెప్పారు. కొందరిని మనం కూడా గుర్తుపట్టవచ్చు. వారు ఎడమప్రక్కనుండి వరుసగా 
1.జాన్ మాస్టారు (డ్రాయింగ్) 2.రంగదొరై మాస్టారు (సంస్క్రతం) 3.అప్పారావు మాస్టారు (డ్రిల్) 4.సంతోషం మాస్టారు (తెలుగు) 5.గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు (క్లాస్ టీచర్) 6.ఎన్.సి.ఆంజనేయులు మాస్టారు (హెడ్మాస్టర్) 7.బంగారేశ్వరశర్మమాస్టారు (అసిస్టెంట్ హెడ్మాస్టర్) 8.ఫిజిక్స్ మాస్టారు 9.సోమయాజులు మాస్టారు (ఇంగ్లీషు) 10.మస్తాన్ రావు మాస్టారు (ఎన్.ఎస్) 11.రామకోటి మాస్టారు (ఇంగ్లీషు)  12.రాయపాటి.సుబ్బారావు మాస్టారు (హిందీ)

ఈ బ్యాచ్ లో చదివిన విద్యార్ధులలో  కొందరి గురించి  ప్రస్తుతానికి లభ్యమైన వివరాలు  ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ ఫోటో పంపింన నాటి పూర్వవిద్యార్ధి శ్రీ.పాటిబండ్ల.హరికుమార్ గారు ఫోటోలో చివరి వరుసలో ఎడమనుండి 4వ వారు.    2009లో టెకుమ్సే ఇండియా ప్రై.లి. లో ఫైనాన్స్ మేనేజర్ గా రిటైరయ్యి ప్రస్తుతం హైదరాబాద్ లో పాతబోయిన్ పల్లిలో ఉంటున్నారు.అదే వరుసలో ఎడమనుండి 2వ వారు శ్రీ. కాకుమాను పెదపేరిరెడ్డి . మనందరికీ సుపరిచుతులైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నాటి అసిస్టెంట్ హెడ్ మాస్టర్ శ్రీ. బంగారేశ్వరశర్మ గారబ్బాయి శ్రీ.చల్లపిళ్ల.శర్మ గారు ప్రస్తుతం బి.హెచ్.యి.ల్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు.  నాటి మరొక పూర్వవిద్యార్ధి శ్రీ.డి.బి.శాస్త్రి గారు కూడా రిటైరయ్యి  ప్రస్తుతం దిల్ సుక్ నగర్ లో  చింతలూర ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. మరొక పూర్వవిద్యార్ధి శ్రీ. సూర్యనారాయణరెడ్డి గారు హెచ్.ఎం.టిలో పనిచేశారు. మరొక పూర్వవిద్యార్ధి శ్రీ.మంగళంపల్లి.నారాయణ గారు హైదరాబాద్ లోని హిందూస్ధాన్ యాంటిబయాటిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు. 
నాడు కొందరు గర్ల్స్ కూడా XII A  సెక్షన్ లో ఉండేవారట. వారే క్రింద వరుసలో కూర్చున్నవారు.

పోస్ట్ స్రిప్ట్ : ఈ పోస్ట్ లో ఫోటో గురించిన మరిన్నివివరాలు   అందుబాటులో ఉన్నవారు తెలియజేయగలరు.

9, మార్చి 2011, బుధవారం

మున్సిపల్ హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ.గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నివాళులు

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్  ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది సంవత్సరాలుగా తన దత్తత కుమారుడైన గడ్డం.హరిబాబు(పేటలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు) గారి దగ్గరే ఇంట్లోనే వైద్యపరివేక్షణలో  ఉంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్లో మేము nrt85 సిల్వర్ జూబ్లి మీట్ కు  ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయన్ను కలిసి మాట్లాడేందుకు ఆయన అనారోగ్య కారణాలవల్ల  సాధ్యం కాలేదు. ఇంతలోనే నిన్న ఉదయం (09-03-2011) ఆయన మరణించినట్లు వార్త తెలిసింది. గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు నరసరావుపేట స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. పట్టణంలో అందరికీ సుపరిచితులైన ,  మున్సిపల్ హైస్కూల్ లో మా పూర్వఉపాధ్యాయులు మరియు  హెడ్ మాస్టర్ గా రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నరసరావుపేట వూర్వ విద్యార్ధుల వేదిక నివాళులర్పిస్తోంది.

3, మార్చి 2011, గురువారం

మహాశివరాత్రి తిరనాళ్లకు కోలాహలంగా కోటప్పకొండ- నరసరావుపేట పరిసరాలు

మహాశివరాత్రి...... ఈ పదం వినగానే కోటప్పకొండ గుర్తుకొస్తుంది ఎవరికైనా.
దాంతోపాటు నాటి  ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని పాట
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా           ఆరుబయట ఎండలో - సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే కన్నుకన్ను కలిపేస్తే              నూటొక్కటెంకాయ కొడతానని....
బుచ్చిబాబు కనిపిస్తే నాకోసం పడిచస్తే              నూటొక్కటెంకాయ కొడతానని.........
కన్నెపిల్ల – బుచ్చిబాబు సంగతెలా వున్నా , నరసరావుపేట యువతకు మాత్రం నేటికీ  శివరాత్రి తిరనాళ్లంటే ఎక్కడలేని ఉత్సాహం  పుట్టుకొస్తుంది. చిన్న పిల్లలు  తయారుచేసుకునే బుల్లి ప్రభలనుండి  పోటాపోటీగా తయారుచేసే  ఆకాశాన్నంటేటట్లుండే పెద్ద కరెంటు ప్రభల దాకా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు కనువిందు చేస్తాయి.
                                 
                           కొండదగ్గర  కొలువుదీరిన  ప్రభలు
                                  బ్రహ్మంగారి గుడి వీధిలో ప్రభ

                                 పాతూరి ఆంజనేయస్వామి గుడి దగ్గరి ప్రభ

                                     మానికలబావి వీధిలో ప్రభ                          

                      మానికలబావి వీధిలో ప్రభముందు యువత కోలాహలం


                              బుల్లి బుల్లి ప్రభలతో చిన్ని చిన్ని పిల్లలు
                   
ప్రొద్దున్న మొదలుకుని రాత్రి దాకా  పలు వీధుల్లో తయారుచేసిన ప్రభలు ముందుగా డప్పులు, నృత్యాలు, బాణాసంచా కోలాహలంతో  కోటప్పకొండకు బయలుదేరాయి. యధావిధిగా మా పాతింటి దగ్గర ., అంటే  శ్రీరాంపురం, బ్రహ్మంగారిగుడి వీధి లో ప్రభలు,  ఇప్పటి మా ఇల్లున్న బరంపేట,శివునిబొమ్మ సెంటర్ నుండి కూడా ఉత్సాహంగా ప్రభలు బయలుదేరాయి. అయితే ఈసారి మాత్రం కొన్ని గ్రామాల, వీధుల పెద్ద ప్రభలు స్ధానికంగా తయారు కాకుండా కొండవద్దనే తయారుచేయబడ్డాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలనుండి ప్రభల్ని తీసుకెళ్లేటప్పుడు దారిలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ఇబ్బందులెదుర్కుంటున్నారు కనుక. ఇక కోటప్పకొండ దగ్గర సీన్ చెప్పాల్సిన పనిలేదు.    చేదుకో కోటయ్యా-ఆదుకో కోటయ్యాఅంటూ భక్తజనం  పరవశంతో  చేసే  నినాదాలతో త్రికోటేశ్వరకొండ దద్దరిల్లింది. కాలినడకన వెళ్లే జనం, ఘూట్ రోడ్డ్ లో వెళ్లే  వాహనాలలో  జనం ., వెరసి  ఎక్కడ చూసినా  జనం .. జనం..    కోటయ్యకొండతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన పర్యాటక కేంద్రం కూడా జనంతో కిటకిటలాడిపోయింది.


తిరనాళ్ల జనసందోహం

పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కొండపై నాగేంద్రుని పుట్ట


  మా చిన్నప్పుడు ప్రొద్దున్నే కాలినడకన నరసరావుపేట నుండి చిన్న ప్రభ కట్టుకుని యలమంద మీదుగా, గురవాయపాలెంలో మా ఫ్రెండ్స్ ని కూడా కలుపుకుంటూ కోటప్పకొండ చేరిన రోజులు మర్చిపోలేం. మెట్లమార్గంలోనే కాక, కొండపైన ఇంకా పైన కొలువుదీరిన పాతకోటయ్య స్వామి దగ్గరకు రాళ్లగుట్టల్లోంచి , చెట్ల పొదల్లోంచి రొప్పుకుంటూ పోయిన రోజులు మరపురానివి-మధురమైనవి. అర్ధరాత్రి దాకా మామూలుగా ఉండే వాతావరణం అర్ధరాత్రి తర్వాత  ఆరోజుల్లో వేసే రికార్డు డాన్స్ షోల ప్రారంభంతో ఉన్నట్లుండి వేడెక్కేది.  తర్వాతకాలంలో నిషేధించబడ్డప్పటికీ, చాలాకాలం పాటు మా చిన్నతనంలో మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లేటప్పుడు వరవకట్ట నుండి మసీదు సెంటర్ మీదుగా గడియారస్తంభం సెంటర్ కు వెళ్లే మార్గంలో  డ్యాన్స్ పార్టి బోర్డులు , ఆ పేర్లు ఇప్పటికీ అలానే గుర్తున్నాయి.

అలంకరణతో శివునిబొమ్మ సెంటర్లో మహాశివుడు

క నరసరావుపేట పట్టణంలో శివరాత్రి సందర్భంగా కనబడే కొన్ని విశేషాలు  జగత్ప్రసిద్ధమే.  పిల్లల ఆటవస్తువుల దుకాణాలు, తినుబండారాల దుకాణాలు, మార్కెట్ సెంటర్లో చెరుకుగడల కుప్పలు ., ఇక మామూలురోజుల్లో కేవలం నాలుగు షోలు ప్రదర్శించబడే సినిమాల్ని  శివరాత్రిరోజు   వీలైనంత ఎక్కువ స్పీడు తిప్పి – కొన్ని సీన్లు కట్ చేసి మరీ  ఒక్కో సినిమా 24గంటలూ నాన్ స్టాప్ గా ఏడెనిమిది షోలు ప్రదర్శించడంలో పోటీపడే సినిమాహాళ్లు .,  ఇదీ పరంపర.,

           ఏదైనా అరుదుగా జరిగితే   .. జన్మకో శివరాత్రి అంటుంటారు.  కానీ  మా ఊర్లో  ఏడాదికో సారి వచ్చే శివరాత్రి మాత్రం నిజంగా చాలా ప్రాధాన్యత కల్గిందనటంలో సందేహం లేదు. 


26, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రియమైన మిత్రులారా

మన నరసరావుపేట బ్లాగు లొ ఇప్పటివరకు కేవలం కొద్దిమంది మాత్రమే పొస్ట్ చేస్తున్నారు.  మీరు మీకు అందుబాటు లొ ఉన్న మునిసిపల్ హైస్కూలు పూర్వ విద్యార్ధులు అందరికి ఈ బ్లాగ్ గురించి తెలియచేసి ఎక్కువమంది పాల్గొనేటట్లు చూడగలరు.-ఆనంద్ కుమార్

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురం!

మా జ్ఞాపకాల  గురించి చెప్పే ముందు నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవాలి. నేను చేసిన ఎంక్వైరి ప్రకారం పాత భవనంలో ఆఫీసు ప్రక్కన ఉండే కెమిస్ట్రీ ల్యాబ్ పైన ఒక రాతిమీద 1901 వ సంవత్సరం అని ఉన్నదని  సీనియర్ మాస్టారు (లంకా మాస్టారు) చెప్పారు. రామకోటి మాస్టారు లాంటి సీనియర్స్ తో మాట్లాడి  ఇతర మున్సిపల్ రికార్డ్స్ పరిశీలించాలని చెప్పారు. ఏమైనా 1901లో ఎలిమెంటరీ స్కూల్ కానీ , డైరెక్టుగా హైస్కూల్ గా కానీ ప్రారంభమైందని చెప్పవచ్చు.  ఇకపోతే ఈ క్రింది ఫోటోలో ఒక విశేషముంది . చూడండి. 
ఈ ఫోటో గుర్తుపట్టారా?
చారిత్రాత్మక మున్సిపల్ హైస్కూల్ ఎంట్రన్స్ లో ఎదురుగా ఉండేది గాంధిగారి విగ్రహం. ఈ విగ్రహం శిలాఫలకంపై 19 ఫిబ్రవరి, 1948 అని ఉంది . చూశారా! అంటే ఈ విగ్రహం కరెక్ట్ గా  గాంధీజీ హత్యానంతరం 19రోజులకు ఆవిష్కరించబడిందన్నమాట. అంత చరిత్రుంది మా హైస్కూల్లో గాంధీ విగ్రహానికి. కొత్త భవనం నిర్మాణం అయిపోయిన వెంటనే ఈ విగ్రహం మరలా క్షేమంగా ప్రతిష్టించడానికి చూస్తున్నారులెండి! ఇప్పుడు ప్రస్తుతం ఈ విగ్రహం హెడ్ మిసెస్ రూమ్ లోనే భద్రపరచబడింది.

అప్పటి బిల్డింగ్ లో హెడ్ మాస్టర్ రూమ్ ప్రక్కన కుడి భాగం


                                             అప్పటి బిల్డింగ్ మరో కోణం నుండి

అప్పటినుండి ఇప్పటికి ఎంతోమంది అసంఖ్యాకమైన విద్యావంతుల్ని తయారుచేసింది ఇదే మున్సిపల్ హైస్కూల్. అందులోభాగంగానే మా జ్ఞాపకాల్ని కొన్నింటిని ఇక్కడ పంచుకుంటాను. 1980-81 నుండి జరిగిన విశేషాలండీ ఇవి.  నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్ అన్నప్పటికీ,  ప్రధానంగా మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ గురించే అనుకోండి నేను వ్రాస్తున్నది. నరసరావుపేటలో  శ్రీరాంపురంలో తిలక్ కాన్వెంట్ నుండి నేరుగా 6వ తరగతికి మున్సిపల్ హైస్కూల్ లో చేరాను. అంతా కొత్త కొత్తగా , భయం భయంగా ఉండేది. దానికి తగ్గట్టే ఉండేవారు  ఛండశాసనుల్లాంటి మా  మాస్టర్లు కూడా. మచ్చుకు కొంతమంది మాస్టర్ల గురించి చెప్తాను. చదివే ముందు ఒకటి గమనించండి సుమా! ఆనాటి మా మాస్టార్ల గురించి , మా చదువుల గురించి సంతోషంతో,సగర్వంతో మీదుమిక్కిలి కొంత సరదాగానే వ్రాస్తున్నాను తప్పించి , వ్యంగ్యంగా-విమర్శతో కాదని చదువరులకు నా మనవి.మాకు అప్పుడు నరసింహారావు మాస్టారు తెలుగు చెప్పేవారు. ఆయన రోజూ హోమ్ వర్క్ దిద్దేవారు.  ఇచ్చిన హోమ్ వర్క్ చెయ్యనివాళ్లని పిలిచి, ముందర ఆయన  చేతికున్న వాచి తీసి టేబుల్ పై పెట్టి, స్టూడెంట్ ను  చేతులు చాపమని  బెత్తంతో వాతలు తేలేలా కొట్టేవారు. ఒకరోజు క్లాసులో మా ముందుబెంచిలో ఒకడు హోమ్ వర్క్ వ్రాయకుండా వచ్చాడు. వాడిపేరు పిలిచిన వెంటనే, వాడు వణుక్కుంటూ క్లాసులో ముందరకు మాస్టారు దగ్గరకు వెళ్ళేసరికి వాడికి ఒకటీ, రెండూ కలిపి 
ఒకేసారి వచ్చాయి. వేసుకున్న లాగుపై ముడ్డిదగ్గర చేయి గట్టిగా పెట్టుకుని వణుకుతూ నిల్చునేసరికిమాస్టారికి పరిస్థితి అర్ధమై, వాసనొస్తుంది, క్లాసులో చేయకురా,బయటకు పో ! అని అరిచారు. వాడు ఒకటే పరుగు బయటకు. క్లాసు వదిలాక చూస్తే దారిపొడుగుతా "నిప్పులు" గుర్తులు.  చూసుకుంటూ తొక్కకుండా  నడవాల్సివచ్చింది.
 బుగ్గమీద మచ్చతో చేతిలో బెత్తంతో నిల్చునే నర్సింహరావు మాస్టారినీ, ఈ సంఘటననీ జీవితంలో మర్చిపోలేమండీ! తర్వాత చెప్పుకుంటున్నది రాధాకృష్ణమూర్తి మాస్టారిగురించి. ఆయన కూడా తెలుగుకే వచ్చేవారు. పంచెకట్టుకొచ్చేది ఆయనొక్కడే మరి. అందుకే ఆయన్ను " గోచి పీకుడు " మాస్టారు అని పిల్చేవాళ్లమి.  తెలుగు చాలా తన్మయత్వంతో  చెప్పేవారు. అలాగే సైన్సుకు వచ్చే వెంకట్రామయ్యగార్ని ఎప్పుడూ నోట్లో వక్కపొడి లేకుండా చూడలేము. ఆయన దూరంగా కనబడగానే "వక్కపొడి మాస్టారు" అనే వాళ్లం. సైన్సు చాలా సరదాగా చెప్పేవారు. ఇక గోపరాజు మాస్టారి గురించి చెప్పాలి. ఆయన మాధ్స్ చెప్పేవారు. పిల్లల్ని  కొట్టాలంటే ముందుగా నుదుటిదగ్గర జుట్టు రెండువేళ్లతో అందినంత పుచ్చుకుని, ఆ జుట్టుతోనే స్టూడెంట్ ని పైకిలేపి కొట్టేవారు. అలాగే కొన్ని విషయాలు సులభంగా  గుర్తుండేందుకు అంటూ గమ్మత్తైన మాటలు సంధానించి చెప్పేవారు.
 వృత్తలేఖిని అనేందుకు ఉత్తలేకిది  అనీ, డి-కోణాన్ని గుర్తుంచుకునేందుకు సగంబొక్కరా దీనికుండేది అనేవారు. అందుకే మా వాళ్లకి చాలామందికి ఇప్పటికీ ఆ పరికరాలు గుర్తుండిపోయాయనుకోండి ! మొన్న డిసెంబర్ లో సిల్వర్ జూబ్లి మీట్ కి  కూడా ఆయన చలాకీగా హాజరై, తన ఆరోగ్య రహస్యాలు చెప్పారు.   డ్రిల్ చేయించే ఆశీర్వాదం మాస్టారు కూడా గుర్తే, ఎందుకంటే పిల్లలతో చాలా సరదాగా ఉండేవారు. ఇక పార్ధసారధిగారు హెడ్ మాస్టర్ గా ఎంత భయపెట్టారో అందరికీ తెల్సిందే. ఆయన బెత్తం పట్టుకుని ధర్డ్ బెల్లు అయినాక నిల్చున్నారంటే,
  ఎవరికైనా లోపలికి పోవాలంటే హడల్ ! ఇక్కడో జోక్ చెప్తానండీ. సుబ్బారావు మాస్టారు మాకు హిందీ చెప్పేవారు. అయనకు మేము పెట్టుకున్న ముద్దుపేరు "హడావిడి సుబ్బారావు". ఆయన తన ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు.  మా స్నేహితుడు జాజం.శ్రీను (ఇప్పుడు nrtలో బిజినెస్ చేస్తున్నాడు) మాస్టారిని తమాషా పట్టించాడు. ఎలాగంటే ఒకసారి జాజం.శ్రీను బజారులో సుబ్బారావు మాస్టారికి కనబడి, నమస్తే మాస్టారూ అన్నాడు. ఏరా  ట్యూషన్ కి రాకూడదా అన్నారు మాస్టారు. మనవాడు వెంటనే వద్దామనే అనుకుంటున్నా అన్నాడు. సరే అయితే , ఒక టీ త్రాగిపోరా అన్నారు మాస్టారు. శ్రీను హాయిగా మాస్టారి డబ్బులతో ఒక టీ తాగేసి చెక్కేశాడు. మరలా వారం రోజుల తర్వాత మనోడు మాస్టారికి కనబడ్డాడు. ఏరా రాలేదు ట్యూషన్ కి అన్నారు మాస్టారు. రేపటినుండి వద్దామనుకుంటున్నా అన్నాడు మనోడు. సరే, టీ త్రాగిపోరా అన్నారు మాస్టారు. రెండోసారి కూడా హ్యాపీగా మాస్టారి డబ్బులతో టీ త్రాగేశాడు మనోడు. తర్వాత 10రోజులకి మనోడు మాస్టారికి మల్లమ్మ సెంటర్లో మరలా కనబడ్డాడు. ఏరా ఇంకా ట్యూషన్ కి  రావడంలేదు అన్నారు మాస్టారు. ఏంలేదు సార్, మంచిరోజు చూసుకుని వెళ్లమంది మా అమ్మ. ఎల్లుండి నుండి వద్దామనుకుంటున్నా అన్నాడు శ్రీను. మరలా మాస్టారు యధావిధిగా తన డబ్బులతో టీ త్రాగించారు. అంతే !  అప్పటినుండి వాడు మాస్టారికి కనబడకుండా తిరిగేవాడు. పాపం మాస్టారికి మూడు టీలు బొక్క! ఇక ఇంగ్లీషు చెప్పే కాశీ మాస్టారికి పెద్ద బొజ్జ ఉండేది. కానీ ఆయన దగ్గర చాలామంది ట్యూషన్ చదివేవాళ్లం కాబట్టి ఆయనకు నిక్ నేమ్ పెట్టే సాహసం చేయలేదు.
                                            
                                          కొత్త బిల్డింగ్ (నాటి హెడ్మాస్టర్-ఆఫీస్ బ్లాక్)
                                          దానివెనుక పాత బిల్డింగ్
                                 బిల్డింగ్ నిర్మాణంలో జాప్యం ఫలితంగా క్రింద కూర్చున్న విద్యార్ధులు




                                     
నరసరావుపేట పూర్వవిద్యార్ధులవేదిక-nrt85 సభ్యులు
నర్సింహారావు,భాస్కర్,నాగేశ్వరరావు
  తిరుమలేశ్వరరావు, అరవపల్లి.శ్రీను

ఇక పల్నాడు ప్రాంతంలోనే ప్రసిద్ధిగాంచిన మా  స్కూల్లోని గురజాడ కళామందిరం  విశేషాలు చూద్దాం.  

గురజాడకళామందిరం ముందు nrt85బ్యాచ్ మేట్స్

ఈ వేదికపై ఎంతోమంది గొప్ప వ్యక్తులు చారిత్రాత్మక నాటికలు ప్రదర్శించారు.  చింతామణి, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు గొప్ప కళాకారులు ప్రదర్శించేవారు. ఆ నాటకాలు చూసేందుకు పిల్లలం, మా దగ్గర డబ్బులేముంటాయి చెప్పండి, అందుకే హైస్కూల్ వెనుక బజారులోని కందుకూరు వీరేశలింగం ఎలిమెంటరీ స్కూల్ లోంచి గోడదూకి పోయి , నాటకం చూసే వాళ్లమి. ఈ నాటకాలకీ పల్నాడు ఫాక్షన్ కీ ఉన్న ఒక లింకు నాకు బాగా గుర్తుంది. కరెక్టు డేటు ,సంవత్సరం గుర్తులేవు గానీ, మున్సిపల్ హైస్కూల్లో జరిగే నాటకం చూసేందుకు వచ్చిన  ఒక నాయకుడిని ప్రత్యర్ధి వర్గం వాళ్లు కాపు కాసి పల్నాడుబస్టాండు దగ్గర చంపివేశారు. ఆ రోజూ అంతా హడావిడి. ఆ తర్వాత మామూలే. అలాగే మా ఊర్లో శ్రీరాంపురంలో మా పాతింటి దగ్గర ఎలక్షన్ మరుసటి రోజున  ముందురోజు పోలింగ్ బూత్ ల్లో ఎత్తుకొచ్చి  పగలగొట్టిన  బ్యాలెట్ బాక్సుల్లోంచి బ్యాలెట్ పేపర్లు చిందరవందరగా రోడ్డునిండా పడిఉండేవి. మాఇంటి దగ్గర్లో పోస్టాఫీసుబడి పెద్ద పోలింగ్ బూత్ కాబట్టి.  అమ్మో , ఇంక వద్దులెండి మా ఊరి ఫాక్షన్ కబుర్లు.  
మున్సిపల్ ఆఫీస్ గాంధిబొమ్మ సెంటర్లో డీలక్స్ టీసెంటర్ 
ఇకపోతే మా ఇల్లు శ్రీరాంపురం లోని పాతపోలీస్ స్టేషన్ ఎదురుగా వద్మావతమ్మ హాస్పిటల్ రోడ్డులో ఉండేది. నేను హైస్కూల్ కి పోవాలంటే ఒక్కోసారి దగ్గరదారిలో పోయేవాడిని. ఎలాగో ఊహించండి. ఏం లేదండీవరవకట్ట మీదుగా వచ్చి  మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా డీలక్స్ టీ సెంటర్  ఉండేది. దాని వెనుక గవర్నమెంట్ హాస్పిటల్ గోడ ఉండేది. దాని మీదుగా హాస్పిటల్లోకి దూకి, హాస్పిటల్ మెయిన్ గేటులోంచి ఎదురుగా ఉండే మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లేవాడిని.  నాకు చిన్నప్పటినుండీ దుముకుడు మనస్తత్వం అనుకుంటున్నారు కదూ , ఇదంతా చదివి !  కొంతవరకు నిజమే అనుకోండి!! 

 ఇక స్కూల్లో చెట్లక్రింద వంగుళ్లు-దూకుళ్లు గురించి చెప్పే పనే లేదు. ఖాళీ దొరికితే అదేపని. ఆ చెట్లు ఇప్పుడు కూడా గర్ల్స్ హైస్కూల్ కొత్త బిల్డింగ్ కీ  వాటర్ ట్యాంక్ కీ మధ్యలో చూడచ్చు క్రింది ఫోటోలో. 

ఇక ఆదివారాలు  అయితే బిళ్లంకోడు ఆడేవాళ్లం గ్రౌండ్ లో. కానీ స్కూల్ మొదట్లోనే  పలకరిస్తున్నట్లుండే వాలీబాల్ మాత్రం మా సీనియర్స్ ఆడుతుంటే అప్పుడప్పుడూ అలా చూస్తుండేవారం. ఇక హైస్కూల్ ఎగ్గొట్టి సినిమాలకెళ్లిన రోజుల గురించి చెప్పేపనే లేదు. సత్యనారాయణ టాకీసు దగ్గర్లోనే ఉండేది కనుక  ఎక్కువగా వెళ్తుండేవాళ్లం.   అప్పట్లో మా సర్కిల్ లో కృష్ణ ఫాన్స్, శోభన్ బాబు ఫాన్స్ ప్రధానంగా ఉండేవారు. మా మున్సిపల్ హైస్కూల్ విద్యార్ధులే ఎక్కువగా రిలీజ్ సినిమాలకు హాల్ దగ్గరికి వెళ్లి బ్యానర్స్ కట్టడం, పోస్టర్లు అతికించడం చేసేవాళ్లు. కానీ ఫాన్స్ పేరుతో కొట్టుకునేంత లేదులెండి! పాపం, నాతో ఆ రోజుల్లో కృష్ణ ఫ్యాన్స్ లో యాక్టివ్ గా తిరిగిన షరీఫ్ అనే అప్పటి క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడని ఇటీవల తెలిసినప్పుడు చాలా బాధేసింది. అలాగే శివరాత్రికి చిన్న చిన్న ప్రభలు స్వంతంగాతయారుచేసుకుని కోటప్పకొండకు 11కి.మీ లాక్కుంటూ వెళ్లినరోజులు కూడా మున్సిపల్ హైస్కుల్ రోజులతో ముడిపడివున్నవే. నరసింహారావూ, నేనూ కలిసి ప్రభ తయారుచేసుకుని కోటప్పకొండకెళ్లి పువ్వాడ గాడి క్యారియర్ లాక్కుని తినేసినందుకు  చాలా సంవత్సరాలు వాడూ మేమూ మాట్లాడుకోలేదు. ఇటీవల నరసరావుపేటలో కలిస్తే క్లాత్ షోరూంలో కూర్చున్న పువ్వాడ.శివనాగేశ్వరరావు మా ఇద్దర్నీ టీ త్రాగేదాకా వదల్లేదు. ఇకపోతే ఇటీవలి మా  సిల్వర్ జూబ్లి మీట్ కోశాధికారిగా వ్యవహరించిన గొడవర్తి.తిరుమలేశ్వరరావుని ఆ రోజుల్లో బంగారు పిచ్చుకఅని నర్సింహారావు మాస్టారు పిల్చేవారు. ఎందుకంటే వాడిది మెయిన్ రోడ్లో పెద్ద బంగారం షాపు కాబట్టి. ఇంకొకడు ఊటూకూరి.వెంకయ్య. వాడికి నర్సింహారావు మాస్టారు పెట్టిన పేరు దొంగ స్వాములు”. ఎందుకంటే వాడు ఒకసారి స్కూల్ కు  రాలేదేందిరా అంటే ఇలా చెప్పాడు. మా ఇంటికి నిన్న పెద్ద స్వాములవారు వచ్చారు. పూజా కార్యక్రమాల వల్ల రాలేదు అన్నాడు . అందుకని మాస్టారు అరే దొంగస్వాములుఅని పిల్చేవారు. ఇక హైస్కూల్ రోజుల్లో హైస్కూల్ ఎగ్గొట్టి లింగంగుంట్ల కాలువలో ఈత కొట్టడానికి మా నాన్న ఇచ్చిన పాత హంబర్ సైకిల్ పై ముగ్గుర్ని ఎక్కించుకుని పోయిన జ్ఞాపకాలు కూడా చెప్పాలి. ఈత కొట్టి వస్తే కళ్లు ఎర్రపడేవి. నేను నిజం చెప్పకపోతే, మా అమ్మకి అనుమానం వస్తే నిక్కర్ లోపల మొలత్రాడు పట్టుకుచూసేది. మొలతాడంతా ఈతకొట్టి వచ్చాక చాలాసేపు తడిగానే ఉండేదికదా! అలా దొరికిపోయేవాడిని.      ఇవన్నీ ముగిసి రఘరామయ్య కాలేజిలో  ఇంటర్ బై.పి.సి,, గుంటూరు మెడికల్ కాలేజిలో మెడిసిన్, తర్వాత వైద్యవృత్తి., అలా అలా కాలచక్రం గిర్రున పాతికేళ్లు తిరిగాక  ఇటీవలే డిసెంబర్ 19, 2010 నాడు nrt85 సిల్వర్ జూబ్లి మీట్ జరిపాము. ప్రధానంగా 84-85లో 10తరగతి మున్సిపల్ హైస్కూల్లో (ఇతర హైస్కూల్స్ లో చదివిన వాళ్లని కూడా ఆహ్వానించామనుకోండి) చదివిన వారు ప్రతినిధులుగా 200మందికి పైగా హాజరయ్యారు.


రామకోటి మాస్టారు,ప్రసాదరావు మాస్టారు
జ్యోతి మేడమ్,భారతీమేడమ్, లంకా మాస్టారు
రంగదొరై మాస్టారు  -  nrt85 బ్యాచ్ విద్యార్ధులు


 
ఆర్గనెజర్స్ నర్సింహారావు,డా.శివబాబు,డా.ఆనంద్,భాస్కర్

 పల్నాడురోడ్డులోని జి.ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మీటింగ్ అనంతరం మేమంతా ప్రదర్శనగా మున్సిపల్ హైస్కూల్ కి వెళ్లి  పాతికేళ్ల క్రితం నాటి మా మధురజ్ఞాపకాల్ని నెమరేసుకున్నాము. మగపిల్లల హైస్కూల్లో ఇప్పటికీ ఆరు సంవత్సరాలనుండి బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  పదోతరగతి పిల్లలకు కూడా పరీక్షలు వ్రాసేందుకు బెంచీలు లేవు.  ప్రస్తుతం హెడ్ మిసెస్ . జ్యోతి మేడమ్ రిక్వెస్ట్ మేరకు మా nrt85  బ్యాచ్ తరపున 5బెంచీలు, 5గురికి  1,116రూ.  మెరిట్ స్కాలర్ షిప్ బహుకరించాము. అలాగే రానున్నకాలంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిసంవత్సరం ఈ  మెరిట్ స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు ఒక రిజర్వ్ ఫండ్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించాము. అయితే కేవలం మేము కేవలం ఆర్ధిక సహాయం చేయడంతో పరిమితం కాకుండా , మున్సిపల్ హైస్కూల్ ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ప్రజల, అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసేందుకు ఇంకో కార్యక్రమం అదేరోజు చేశాము. మున్సిపల్ హైస్కూల్ సందర్శన అనంతరం ప్రతినుధులందరం ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ ఆఫీసు సెంటర్లో ఉన్న మహాత్మాగాంధి విగ్రహానికి ఒక వినతిపత్రం ఇచ్చి , మా స్కూల్ సమస్యలు పరిష్కరించమని నినాదాలు చేశాము.

మున్సిపల్ హైస్కూల్ సమస్యలు పరిష్కరించాలని
గాంధివిగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

దానికి కొనసాగింపుగా మున్సిపల్ హైస్కూల్ సమస్యలపై సర్వే చేసి, పత్రికా ముఖంగా ప్రజలు,అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా nrt85 విద్యార్ధులుగా మేం చొరవ తీసుకోవడం జరిగింది. గ్రీవెన్స్ సెల్ లో ఎం.ఆర్.ఓ, ఆర్.డి.ఓ. దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఫలితంగా కొంత మెరుగుదల కనిపించింది.
హెడ్మిసెస్ జ్యోతి మేడమ్ తో సమస్యలు 
తెలుసుకుంటున్న nrt85 విద్యార్ధులు


 ఏదైతేనేం , ఇప్పటికి మున్సిపల్ హైస్కూల్ బిల్డింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది వ్రాసే నాటికి రంగులు, కిటికీలు,కరెంటు పనులు కూడా చకచకా సాగుతున్నాయి.


 నాలాంటి, మా సహచరులలాంటి  ఎంతోమంది అసంఖ్యాకమైన వ్యక్తుల్ని ఈ సమాజానికి విద్యావంతులుగా అందించిన మా నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ ఎప్పటికీ చరిత్రలో సగర్వంగా నిలబడాలని మా అందరి కోరిక. ప్రభుత్వరంగ విద్యాలయాలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం చోటుచేసుకుంటున్న నేటిసమాజంలో ఒక చారిత్రక స్ఫూర్తిగా ఎప్పటికీ   మా మున్సిపల్ హైస్కూల్ నిలవాలని మా ఆశ. అందుకోసం ఈ నరసరావుపేట పూర్వ విద్యార్ధుల వేదిక ఎప్పటికీ కృషి చేస్తుందని మీ అందరికీ మా హామీతో ముగిస్తున్నాను.

పోస్ట్ స్రిప్ట్ :  పైన పేర్కొన్నవన్నీ యదార్ధ సంఘటనలే. పైన పేర్కొన్న వారిలో  కొందరు ఉపాధ్యాయులు ఈ కాలంలో  మరణించడం జరిగింది. మేము సిల్వర్ జూబ్లి మీట్లో ప్రధమంగా చేసిన పని మరణించినవారి స్మత్యర్ధం శ్రద్ధాంజలి ఘటించడం. పేర్లు , నిక్ నేమ్స్ పేర్కొనడం ఆప్యాయతతో, అనుబంధంతోనే తప్పించి , వేరే ఉద్దేశ్యంతో కాదని చదువరులకు మనవి. మర్చిపోయానండీ, అంతర్జాతీయ తెలుగు మాసపత్రిక "విజ్ డమ్" వ్యవస్ధాపక సంపాదకులు,  నరసరావుపేట  మున్సిపల్ హైస్కూల్   మాజీ విద్యార్ధి శ్రీ కె.వి.గోవిందరావు గారు స్వయానా మా పెద్దనాన్న గారే!