21, ఫిబ్రవరి 2013, గురువారం

జెనరిక్ మందులపై అవగాహనా సెమినార్

నరసరావుపేట పట్టణంలో ది.18-02-2013 (సోమవారం) నాడు ఎన్.జి.ఓ. హోమ్ లో  పల్నాడు వినియోగదారుల సంఘం  ఆధ్వర్యంలో " జెనరిక్ మందులు-ఒక అవగాహన" అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ (nrt85) పూర్వ విద్యార్ధి డా.కె.శివబాబు ప్రధానవక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో మరో nrt85బ్యాచ్ మేట్ మరియు లోక్ సత్తా ఉద్యమసంస్ధ కార్యదర్శి నాగసరపు.నర్సింహారావు కూడా పాల్గొన్నారు. సెమినార్ కు శ్రీ.చలమయ్య అద్యక్షత వహించారు. బహుళజాతికంపెనీలకు అనుగుణంగా పేటెంట్ చట్టంలో చేసిన మార్పులు కూడా దేశంలో జెనరిక్ మందుల ఉత్పత్తికి ఆటకంగా మారినాయన్నారు. హెచ్.ఐ.వికి వాడే కొత్త జెనరేషన్ మందులు పేటెంట్ చట్టంలో మార్పులవల్ల తృతీయ ప్రపంచ దేశాల ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. అహేతుకమైన జాతీయ ఔషధ విధానం ఫలితంగా  లాభాల మార్జిన్ ఎక్కువుండే అనవసర మందులు ఎక్కువగా ఉత్తత్తి చేస్తున్న బహుళజాతికంపెనీల చర్యలవల్ల సామాన్య ప్రజానీకానికి అత్యవసర, ప్రాణాధార మందులు దొరకని పరిస్ధితి ఏర్పడుతున్నదని అన్నారు.  అత్యధిక ధర కల్గిన బ్రాండ్ అత్యధికంగా అమ్ముడుపోవడానికి  కంపెనీల లాభాపేక్ష, మార్కెటింగ్ టెక్నిక్స్ , డాక్టర్లను ఆకట్టుకోవడం  కారణమని అన్నారు. జెనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి మండల స్ధాయిలో జెనరిక్ మందుల ఔట్ లెట్  ప్రారంభించేలా ప్రజలు, ప్రజాపక్షపాతులు ఉద్యమించాలన్నారు.