28, జనవరి 2011, శుక్రవారం

మా ఊరి గాంధీబొమ్మకి ప్రొమోషన్ వచ్చిందోచ్

నిన్నకాక మొన్నే డిసెంబర్ 19న nrt85 సిల్వర్ జూబ్లి మీట్ జరుపుకున్నాం. అదేరోజు మేం చదువుకున్న మున్సిపల్ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీసు సెంటర్లో గాంధీ బొమ్మకు వినతిపత్రం కూడా సమర్పించాము.  హైస్కూల్లో సమస్యలైతే చాలా కొద్దిగానే పరిష్కారమైనయి గానీ, మా వినతిపత్రం తీసుకున్న గాంధీగారి విగ్రహానికి మాత్రం కాంస్య విగ్రహంగా ప్రొమోషన్ వచ్చింది. జనవరి 28 అంటే నిన్న పాతగాంధీవిగ్రహం స్ధానంలోనే కొత్తగా మిలమిల మెరిసే కాంస్యవిగ్రహాన్ని మాజీముఖ్యమంత్రి,స్ధానికమంత్రివర్యుల ఆధ్వర్యంలో కోలాహలంగా ఆవిష్కరించారు. ఈ మెరుపులు, ప్రసంగాలు, పేపర్ క్లిప్పింగ్స్ , ప్రచారకార్యక్రమం చూస్తుంటే నిజంగానే నరసరావుపేటంతా మెరిసిపోతున్నదేమోననిపిస్తుంది. కానీ అంతకు ముందు రోజే  మా మిత్రులు నరసరావుపేట మరియు చుట్టుప్రక్కల రోడ్ల పరిస్ధితిపై  గుంటూరుజిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీలో ప్రజా ప్రయోజన వాజ్యం వేసినారు. జడ్జి ముందు హాజరైన ఆర్ & బి అధికారులు రోడ్లన్నీ బాగానే ఉన్నయంటూ కితాబిచ్చారు. కానీ రోడ్ల వాస్తవ పరిస్ధితిపై మనమిత్రలు గట్టిగా పట్టు పట్టడంతో జడ్జి ఆదేశం మేరకు జనవరి 27వతేదినాడు ఆర్ & బి అధికారులతో జాయింట్ ఇనస్పెక్షన్ చేయడంతో రోడ్ల నిజస్ధితి బయటపడింది . క్రింద ఫోటోలు చూడండి. నరసరావుపేట-పిడుగురాళ్ల రోడ్డు, నకరికల్లు-గుండ్లపల్లి రోడ్డు,నకరికల్లు-సంతమాగలూరు అడ్డరోడ్డు,సంతమాగలూరు-నరసరావుపేటరోడ్డు,నరసరావుపేట-కేసానుపల్లి రోడ్డు తనిఖీలో ఎలా ఉన్నాయంటే, ఈ రోడ్డుల్లో ఏ మాత్రం పరధ్యానంగా ప్రయాణం చేసినా సీదా పరలోకానికే ప్రయాణం- టిక్కెట్ లేకుండా.  ఇందుమాలంగా  ఈ పరిస్ధితిని నరసరావుపేట మేలుకోరే నెట్ జెన్ లందరికీ తెలియజేయడమైనది.మనఊరికెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోగలరని మనవి.
డా.శివబాబు
                                              
27-01-2011 నాడు తనిఖీలో నరసరావుపేట చుట్టుప్రక్కల రోడ్ల పరిస్ధితి ఈ క్రింది ఫోటోల్లో చూడండి
ఈ " నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక " సభ్యుడు నరసింహారావును కూడా తనిఖీ చేస్తున్న ఫోటోల్లో చూడచ్చు








24, జనవరి 2011, సోమవారం

తెలుగు వికీపీడియా వేడుకలు

మిత్రులారా,


తెలుగు వికీపిడియా దశాబ్ది వేడుకలు 23(ఆదివారం) ఉత్సాహంగా జరిగాయి. కొద్దిమంది నాకు తెలీని బ్లాగర్లను కలుసుకోవడం, వికీపీడియా గురించిన సమాచారం తెలుసుకోవడం నాకు ఉపయోగించాయి. అలాగే ఇకముందు తెలుగు వికీపీడియాకు ఎంతోకొంత దోహదం చేయాలని అనుకుంటున్నాను.

19, జనవరి 2011, బుధవారం

మంచిపాట

హాయ్,
 నరసరావుపేటలో డిసెంబర్ 19న  సిల్వర్ జూబ్లి మీట్ రోజు ప్రారంభ వచనాల సందర్భంలో నేను ఉదహరించిన రుద్రవీణ సినిమాలోని పాట గుర్తుకొచ్చి, ఇక్కడ వ్రాస్తున్నాను. ఈపాట నాకు దైనందిన జీవితంలో ఎన్నోసార్లు గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరికీ  అన్వయించుకునేందుకు చాలా బాగుంటుందనిపిస్తుంది . మాతృభూమికి, సాటి ప్రజలకు ప్రతి ఒక్కరి జీవితం ఎంతో కొంత ఉపయోగం లేదా సహాయం నిర్వర్తించాలన్న భావం ప్రతిధ్వనిస్తుంది ఇందులో.


చుట్టుపక్కల చూడర చిన్నవాడా!
చుక్కల్లో  చూపు చిక్కుకున్నవాడా!!
కళ్లముందు కటికనిజం కానలేని గుడ్డిజపం
సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటిమనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు- సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు  తరుణం వస్తే తప్పించుకు పోతావా
తెప్ప తెగలబెట్టేస్తావా ఏరు  దాటగానే       -  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా... చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా.....

15, జనవరి 2011, శనివారం

ఈ ఫోటోలో ఎవరెవరున్నారో ఎవరైనా చెప్పగలరా?

ఈ ఫోటో పొన్నాడ.దివాకర్ పంపింది.  పాండురంగారావు మాస్టారి ట్యూషన్ మేట్స్ (?10th 1985) అని వ్రాసినట్లు గుర్తు. ఎవరైనా గుర్తుపడితే ఇందులో ఎవరెవరున్నారో దయచేసి ఇక్కడ వ్యాఖ్యలో తెలియచేయగలరు.

12, జనవరి 2011, బుధవారం

సిల్వర్ జూబ్లి సిడి / డివిడిలకై సంప్రదించండి

మిత్రులారా,
nrt85 సిల్వర్ జూబ్లి ఫంక్షన్ ఫోటోల సిడి మరియు ప్రోగ్రాం వీడియో డివిడి రెడీ అయినాయి. కావల్సినవారు ఆర్గనైజర్స్ ను సంప్రదించగలరు. నాగసరపు.నరసింహారావు(9246453353),తిరుమలేశ్వరరావు(9290099330),అశోక్ (9866325267), జుజ్జూరి.రామకృష్ణ(9441010264),భాస్కర్(9246453702) లలో ఎవరినైనా సంప్రదించగలరు.

9, జనవరి 2011, ఆదివారం

టీచర్ల నుండి హర్షాతిరేకాలు

మిత్రులారా,
మన సిల్వర్ జూబ్లి మీట్ నిర్వహణ పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ అనంతరం రామకోటి మాస్టారు పిలిస్తే,    మాస్టారింటికి నేను,నరసింహారావు వెళ్లాము. మాస్టారు చాలా సంతోషించారు. అలాగే శర్మ మాస్టారు కూడా. ఇక్కడ ప్రత్యేకించి రంగదొరై మాస్టారి గురించి చెప్పాలి. మాస్టారు మన మీటింగ్ గురించి వినగానే  సమయం తక్కువగానే ఉన్నప్పటికీ, శ్రీరంగం నుండి అప్పుడే చెన్నైవచ్చిన బడలికకూడా లెక్కచేయకుండా రైలుకి బయలుదేరి నర్సరావుపేట వచ్చేశారు. తర్వాత కూడా మొన్న నాకు, నర్సింహారావుకు ఫోన్ చేసి ఫోటోల సిడి, వీడియో డి.వి.డి పంపమని అడిగారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా జ్యోతి మేడమ్ కూడా మున్సిపల్ హైస్కూల్ సమస్యల పరిష్కారంకోసం మనం చేస్తున్న కృషికి అభినందనలు తెలియచేశారు. అలాగే రెండురోజుల్లో బెంచిలు తీసుకెళ్ళి ఇవ్వనున్నారు.

nrt85 సిల్వర్ జూబ్లి ప్రారంభం- శ్రద్ధాంజలి మరియు స్వాగతోపన్యాసం వీడియో


6, జనవరి 2011, గురువారం

పరిచయాలు పార్ట్-1

ఇద్దరిలో ఎవరు ప్రముఖులో ఈ వీడియో చివరిదాకా చూడండి!

గోపరాజు మాస్టారి సన్మానంకై చూడండి

ప్రసాదరావు మాస్టారి సన్మానదృశ్యానికై చూడండి

సిల్వర్ జూబ్లి ప్రారంభ సంరంభాల వీడియోకై చూడండి

స్వామి మాస్టారి సన్మానం వీడియోకై చూడండి

4, జనవరి 2011, మంగళవారం

సిల్వర్ జూబ్లి ఫోటోలన్నీ పొందుపర్చపడ్డాయి

మిత్రులారా,
అన్ని సిల్వర్ జూబ్లి ఫోటోలు(208) ఈ బ్లాగులో  పొందుపరుస్తున్నాము. అనివార్యకారణాలవల్ల అలస్యంగా అందిస్తున్నందకు క్షంతవ్యులం. ఫోటోలకై  కుడిప్రక్కనున్న  "  సిల్వర్ జూబ్లి ఫోటోలు(208) "  అన్న లింక్ పై క్లిక్ చేయగలరు.  ఏదైనా ఫోటోను పెద్దదిగా చూసేందుకు ఆ ఫోటోపై డబుల్ క్లిక్ చేయగలరు. ఫోటోను కాపీ లేదా సేవ్ చేసుకునేందుకు కనబడే ఫోటోపై  రైట్ క్లిక్ చేసి చేసుకోగలరు. బ్లాగు నిర్వహణపై  సూచనలకై, ఫోటోలు తదితర సమాచారంకై  మీ వ్యాఖ్యలు ఇక్కడ పోస్ట్ చేయగలరు  లేదా  నన్ను సంప్రదించగలరు.వీడియో క్లిప్పింగ్స్  మరియు  సిల్వర్ జూబ్లికి విచ్చేసిన ప్రతినిధుల పేరు, అడ్రస్సు తదితర పూర్తి వివరాలు కూడా త్వరలోనే పొందుపర్చగలము.
అభినందనలతో,
డా.శివబాబు

నూతన సంవత్సర శుభాకాంక్షలు




మిత్రులారా,
నరసరావుపేట పూర్వ విద్యార్ధులందరికీ నూతన సంవత్సర శుబాకాంక్షలు. దశాబ్దం ఇట్టే గడిచిపోయింది. ఎన్నో ఆశలు,సంతోషాలు, దుఖాలు, కోపాలు, తాపాలకు సాక్షీభుతంగా నిల్చిన సంవత్సరం ముగిసి నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. గతం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా తిరిగిరానిది. అందుకే మన బాధల్ని, ఓటముల్ని డిసెంబర్31తో వదిలేసి కొత్త కొత్త ఆశలతో , ఆశయాలతో, పట్టుదలతో , ప్రేమ-సౌభ్రాత్వత్వాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.
మిత్రులందరికీ  నూతనసంవత్సరం ఆరోగ్యాన్నీ, అభివృద్ధినీ, సంపదనూ పంచి ఇవ్వాలని  ఈ వేదిక మనస్ఫూర్తిగా  కోరుకుంటుంది.

nrt మున్సిపల్ హైస్కూల్ సమస్యల పరిష్కారానికి కృషి

మిత్రులారా,
నరసరావుపేట మున్సిపల్  హైస్కూల్లో  గత ఆరేళ్లుగా  భవననిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. విద్యార్ధలు బెంచిలు లేక నేలపై కూర్చోవలసివస్తుంది. కరెంటు,ఫ్యాన్స్ సమస్య కూడా ఉన్నది. ఈ సమస్యల పరిష్కారానికై మన పూర్వవిద్యార్ధులు నాగసరపు.నరసింహారావు,మేకల.నాగేశ్వరరరావు గతంలో లోక్ సత్తా వారి సహకారంతో, హైస్కూల్ ను  పత్రికావిలేఖరులతో సహా సందర్శించి , ప్రస్తుత హెడ్ మిసెస్. జ్యోతి మేడమ్ తో మాట్లాడి సమస్యలన్నిటినీ పత్రికాముఖంగా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కృషిలో భాగంగా డిసెంబర్ 27నాడు ఎం.ఆర్.ఓ వద్ద గ్రీవెన్స్ సెల్ లో సమస్యలన్నిటినీ రికార్డు చేయించడం జరిగింది. అదేరోజు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ను కలిసి సమన్యల పరిష్కారానికి హామి పొందడం జరిగింది. కమిషనర్ వాగ్ధానం మేరకు ఎలక్ట్రిసిటి , ఫ్యాన్స్ పనులు సత్వరమే చేయిస్తామన్నారు. ప్రతినిధుల సమక్షంలోనే భవననిర్మాణ కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. జనవరి,2011 లోగా భవన నిర్మాణ పనులు పూర్తిగావించి అప్పగిస్తామని కమిషనర్ హామినిచ్చారు. అలాగే పెండింగ్ లో ఉన్న పూర్తిస్థాయి(పర్మనెంట్) హెడ్ మాస్టర్ నియామకం కూడా వెంటనే చేపడతామని కమిషనర్ మన ప్రతినిధులు నరసింహారావు, నాగేశ్వరరావు, ఇతర లోక్ సత్తా కమిటి సభ్యులకు హామినిచ్చారు.

నరసరావుపేట 1985 పదవతరగతి విద్యార్ధుల సిల్వర్ జూబ్లి సమ్మేళనం

మిత్రులారా,
నరసరావుపేటలో 1985లో  వివిధ స్కూల్స్ లో  పదవతరగతి చదివిన విద్యార్ధులందరం 2010 డిసెంబర్ 19న సిల్వర్ జూబ్లి సమ్మేళనం జరుపుకున్నాం. ఎంతో ఉత్సాహంగా, ఉద్విగ్నంగా, సంతోషదాయకంగా జరిగిన ఈ సమ్మేళనం పల్నాడురోడ్డులోని జి.ఎస్.ఆర్.ఫంక్షన్హ హాల్ లో నిర్వహించబడింది.  ఉదయం 9గం.లకే ప్రారంభమైన ఈ కోలాహలం సాయంత్రం 5గం.ల వరకూ కొనసాగింది. సుమారు 150మందికి పైగా నాటి విద్యార్ధులు విచ్చేశారు.
నాడు వివిధ స్కూల్స్ లో విద్యాబోధన గావించిన ఉపాధ్యాయులందరు కూడా విచ్చేశారు. ముందుగా గత పాతికేళ్లలో పరమపదించిన వారి స్మృత్యర్ధం సంతాపం పాటించడం జరిగింది. సిల్వర్ జూబ్లి సమ్మేళనం విశిష్టత, పూర్వాపరాల గురించి సభాద్యక్షులు డా.కె.శివబాబు వివరించారు. నాటి ఉపాధ్యాయులను పేరుపేరునా వేదికపైకి ఆహ్వానించి, వారిని ఘనంగా  సన్మానించిన ప్రతినిధులు   వారితో గల సంబంధ బాంధవ్యాలను, తీపిగుర్తులను నెమరువేసుకుని  సంతోషపరవశులయ్యారు. మనుషుల్ని, మానవసంబంధాల్ని చులకనగా చూస్తున్న నేటి సమాజంలో పాతికేళ్లనాటి గురుతులతో కృతజ్ఞతాభావంతో ఆప్యాయంగా ఆహ్వానించి సన్మానించినందుకు ఉపాధ్యాయులందరూ ఎంతగానో సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం ప్రతినిధులందరూ తమతమ పాత అనుభూతులను , ప్రస్తుత వివరాలను, భవిష్యత్ ఆకాంక్షలను వెల్లడించి పరస్పరం పరిచయకార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ప్రతినిధులందరి తరపున నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ కు 5బెంచిలు , అత్యున్నత ప్రతిభ కనబర్చిన 5మంది విద్యార్ధులకు 1,116రూ.లు  బహుకరించనున్నట్లు ప్రకటించారు. సభకు రాలేకపోయిన పూర్వవిద్యార్ధి దండంరాజు.రాము తన మాతృమూర్తి జ్ఞాపకార్ధం మున్సిపల్ హైస్కూల్ లో 8,9,10 వ తరగతుల్లో ప్రతిభావంతులకు తలకో 2,000 రూ.లు బహుకరించనున్నట్లు సందేశం పంపారు.  మధ్యాహ్న భోజనం అనంతరం జరిగిన సమావేశంలో భవిష్యత్తులో నరసరావుపేటలోని హైస్కూల్స్ కి, తమ తోటి మిత్రులకు చేయగల్గిన  ప్రోత్సాహక, సహాయకార్యక్రమాల గురించి చర్చించారు.  అనంతరం ప్రతినిధులందరూ మున్సిపల్ హైస్కూల్ కు ప్రదర్శనగా వెళ్లి సందర్శించి నాటి తమ జ్ఞాపకాలను నెమరువేసుకుని సంతోషించారు. ఇప్పటికీ మున్సిపల్ హైస్కూల్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్దనున్నమహాత్మాగాంధి విగ్రహం వరకు ప్రతినిధులందరూ  ప్రదర్శన జరిపి, గాంధి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.  ఉదయం 9గం.లకు మొదలైన కోలాహలం సాయంత్రం 5గం.ల వరకూ, ఆనందోత్సాహాలతో కొనసాగి పురప్రజలను సైతం ఎంతగానో అబ్బురపరచింది.
ఈ కార్యక్రమానికి   సిల్వర్ జూబ్లి సమ్మేళన కమిటి ప్రధాన కార్యదర్శి నాగసరపు.నరసింహారావు, అద్యక్షులు చెన్నుపాటి.క్పష్ణ, కోశాధికారి గొడవర్తి.తిరుమలేశ్వరరావు, కార్యదర్శివర్గసభ్యులు కొప్పురావూరి.అశోక్,
డా.ఆనంద్, బాస్కర్, పోపూరి.కళ్యాణ్ శ్రీనివాస్, కోట.చంద్రశేఖర్,  అరవపల్లి.శ్రీను, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, జి.వి.ఎస్.ప్రసాద్ మరియు ఇతర ప్రతినిధులుకేశానుపల్లి.శ్రీనివాసరావు,
పడవల.మల్లిఖార్జునరావు,హరిచరణ్,పొన్నాడ.దివాకర్,శివరాత్రి.వీరాంజనేయులు,ఎస్.ఎస్.సుధాకర్ ,కాకుమాను.సీతయ్య
కొల్లా.ఉమేష్, వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,  రామిశెట్టి.శ్రీనివాసరావు, కొత్తా.శేషుకుమార్, రాజనాల.శేషు, కొత్త.నరసింహారావు, స్వర్ణ.రామిరెడ్డి, సత్యసాయి, కూనిశెట్టి.శ్రీనివాసరావు,వువ్వాడ.శివనాగేశ్వరరావు,బత్తుల.కృష్ణ, అమరా.వెంకటేశ్వరరావు, బత్తుల.కృష్ణప్రసాద్, షరీఫ్, ఏల్చూరి.నరసింహారావు, ఆర్.మాధవరావు, డి.సుందరరావు, శ్రీహరి, రవిచంద్రశేఖర్, యెక్కల.శ్రీనివాసరావు, ఎ.ఫణికుమార్, చప్పల్లి.కోటేశ్వరరావు, ఎ.వి.బదరినాధ్, ఎం.అనిల్ కుమార్, దేసు.శ్రీను, జిలాని, మండవ.ప్రసాద్, మన్మోహన్, అల్లాభక్షు, బచ్చు.రామారావు, కొత్త.సాంబశివరావు, నాగకుమార్, అచ్యుతరావు, డా.సుబ్బారెడ్డి, నూతక్కి.శ్రీనివాసరావు, డి.బాలకృష్ణారెడ్డి  ......................................
.................................................హాజరయ్యారు.

( మొత్తం ప్రతినిధుల పేర్లు, మరిన్ని వివరాలు అతిత్వరలోనే ఇదే పోస్టులో  సంధానించబడతాయి)

నరసరావుపేట పూర్వవిద్యార్ధుల పరిచయం

 ప్రియ మిత్రులారా,
మనందరం   ప్రధానంగా నరసరావుపేట పట్టణంలో బాల్యంలో చదువుకున్నాము. ప్రస్తుతం మనలో కొందరు స్ధానికంగానూ, మరికొందరు ఎక్కడెక్కడో స్ధిరపడ్డారు.  ఎక్కడున్నా బాల్యంలో అనుభవించిన మధురానుభూతులు మరచిపోలేం. అందుకే ఈ బ్లాగు ప్రారంభిస్తున్నాం. ఇందులో నరసరావుపేట పట్టణంలో చదువుకున్న అనేకమంది మిత్రులందరి ప్రస్తుత వివరాలు, నాటి అనుభూతులు, పొందుపర్చాలన్నది మా ఉద్దేశ్యం. అంతేగాక, మనలో ఆర్ధికంగా , విద్యాపరంగా ముందంజలో ఉండి, మాతృభూమికి, మిత్రులకు సహాయపడాలన్న ఉద్దేశ్యం కూడా అనేకమందికి ఉంది. అందుకే ఇలాంటి అభిప్రాయాలన్నీ పంచుకోడానికీ, అలాంటి కార్యక్రమాలలో భాగస్వాములవడానికి  కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది.మీరు కూడా ఇందులో భాగస్వాములవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.