కొద్దిరోజుల క్రితం నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లోని శతాబ్దం పైగా చరిత్ర కల్గిన, ఎన్నో పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలకు , రాజకీయ, స్వచ్ఛంధ సంస్ధల సభలకు, మేళాలకు , మహత్తర సంఘటనలకు వేదికగా నిల్చిన గురజాడ కళా మందిరం ఉనికికి ముప్పు వాటిల్లే పరిస్ధితి వచ్చింది. మున్సిపల్ కమీషనర్ ఆదేశాలమేరకు స్ధానిక హైస్కూల్ లో గురజాడ కళామందిరం ఎదురుగా బాలికల విభాగాన్ని బాలుర విభాగంతో వేరు చేస్తామంటూ పునాదులు తవ్వడానికి సిద్ధం చేశారు.
ఈ చర్యతో చారిత్రక నేపధ్యం కల్గిన హైస్కూల్ ఆవరణ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. దీనితో ఈ వేదిక సభ్యులు మరియు లోక్ సత్తా నాయకులు అయిన నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, అరవపల్లి.శ్రీను, భాస్కర్ , జుజ్జూరి.రామకృష్ణ తదితరులు హైస్కూల్ ఆవరణ సమగ్రత పరిరక్షించబడాలని కోరుకునే ఇతర పట్టణ ప్రముఖుల సహకారంతో కమీషనర్ కు ఈ విషయంపై విన్నవించారు. అంతే గాకుండా , సోమవారం గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. స్ధానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలోని గురజాడ కళామందిరం ఎదురుగా తవ్విన పునాదుల పనిని తక్షణమే నిలిపివేయించేలా చేయగలిగారు. సుదీర్ఘ చరిత్ర కల్గి, ఆటస్ధలంగా, కళాప్రదర్శనలకు వేదికగా , పట్టణంలో నడిబొడ్డున నిల్చిన హైస్కూల్ ఆవరణలో అనాలోచితంగా, తొందరపాటు చర్యతో ప్రహరి గోడ కట్టడానికి పూనుకోవడం నష్టదాయకమని నర్సరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక సవినయంగా విన్నవిస్తోంది. మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయమై విజ్ఞప్తి చేసి, సానుకూలంగా హామీ పొందడం జరిగింది. నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ సమగ్రతను కాపాడుకోడానికి కృషి కొనసాగుతుందనీ, అటువంటి చారిత్రిక వేదిక కలకాలం ప్రజలకు స్ఫూర్తిగా నిలిచివుండాలని కోరుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి